TRAI: నెట్‌వర్క్ సమస్యలకు చెక్.. అందుబాటులోకి ట్రాయ్ కొత్త ప్లాట్‌ఫామ్..!
TRAI Network Anubhav: జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శుభవార్త. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) "నెట్‌వర్క్ అనుభవ్" అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.
TRAI: నెట్‌వర్క్ సమస్యలకు చెక్.. అందుబాటులోకి ట్రాయ్ కొత్త ప్లాట్‌ఫామ్..!
TRAI Network Anubhav: ట్రాయ్ తాజాగా నెట్‌వర్క్ అనుభవ్ ప్లాట్‌ఫామ్‌ను (anubhav.trai.gov.in) ప్రారంభించింది. సులభంగా చెప్పాలంటే ఇది ఓ వెబ్‌సైట్. ఇందులో ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వోడా-ఐడియా కంపెనీల నెట్‌వర్క్‌ల పూర్తి సమాచారం లభిస్తుంది. మీ ఇలాకాలో ఏ కంపెనీ నెట్‌వర్క్ వేగంగా ఉంది, ఏది బలహీనంగా ఉందో ఇది చూపిస్తుంది. దీంతో పాటు డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్, కాల్ క్వాలిటీ వివరాలు కూడా తెలుస్తాయి.
ప్లాట్‌ఫామ్ ప్రత్యేకతలు..
లొకేషన్‌ను బట్టి జియో, ఎయిర్‌టెల్, వీఐ నెట్‌వర్క్ పనితీరును చూడవచ్చు. మొబైల్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్, కాల్ క్వాలిటీ వివరాలు తెలుస్తాయి. DND (డూ నాట్ డిస్టర్బ్) స్టేటస్‌ను కూడా తనిఖీ చేయవచ్చు.
స్పామ్ కాల్స్, మెసేజ్‌ల గురించి ఫిర్యాదు చేయవచ్చు, ఆ ఫిర్యాదు స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు. టెలికాం కంపెనీలు కూడా బలహీన నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాలను గుర్తించగలవు.
ఇది ఎలా పనిచేస్తుంది?
నెట్‌వర్క్ అనుభవ్ మ్యాప్ ఆధారిత విశ్లేషణ డ్యాష్‌బోర్డ్. ఇందులో యూజర్ల ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ డేటా, ట్రాయ్ చేసిన డ్రైవ్ టెస్ట్ డేటా, డీఎన్డీ సదుపాయం అందుబాటులో ఉంటాయి. ఇక్కడే మీరు స్పామ్ మెసేజ్‌ల ఫిర్యాదు నమోదు చేయవచ్చు, మీ నెట్‌వర్క్ స్పీడ్‌ను టెస్ట్ చేయవచ్చు. ఇతర యూజర్లు చెక్ చేసిన స్పీడ్ కూడా ఈ మ్యాప్‌లో కనిపిస్తుంది.
ఎవరికి ఏ లాభం?
కస్టమర్లకు: తమ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ మెరుగ్గా ఉందో తెలుసుకుని, సరైన కంపెనీని ఎంచుకోవచ్చు.
టెలికాం కంపెనీలకు: ఏ ప్రాంతంలో కాల్ డ్రాప్ అవుతోంది, ఇంటర్నెట్ నెమ్మదిగా ఉందో తెలుస్తుంది. దీంతో ఆ చోట నెట్‌వర్క్‌ను మెరుగుపరచుకోవచ్చు.
ట్రాయ్‌కు: కస్టమర్లకు వాస్తవంగా ఎలాంటి అనుభవం ఎదురవుతోందో ఈ డేటా ద్వారా తెలుస్తుంది. దాని ఆధారంగా కంపెనీలపై నెట్‌వర్క్ మెరుగుపరచమని ఒత్తిడి తీసుకురావచ్చు.
ట్రాయ్ ఏమంటోంది?
ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా యూజర్లు, ట్రాయ్ చేసే నెట్‌వర్క్ టెస్టుల్లో పారదర్శకత పెరుగుతుందని ట్రాయ్ అధికారి అనిల్ కుమార్ లాహోటి అన్నారు. కంపెనీలకు నెట్‌వర్క్ మెరుగుపరచుకోవడంలో సహాయం అందుతుందని, ట్రాయ్ పని కూడా సులభమవుతుందని ఆయన తెలిపారు.
సర్వీస్ మెరుగుదల ప్రయత్నాలు..
దేశంలో టెలికాం సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఇందులో ట్రాయ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలే కాలింగ్ కోసం చవకైన ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ కోరింది. ఆ తర్వాత జియో, ఎయిర్‌టెల్, వీఐ కస్టమర్ల కోసం చవకైన కాలింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి.




