PM-WANI: భారత్‌లో ఉచిత ఇంటర్నెట్ విప్లవం.. ఒకే పాస్‌వర్డ్‌తో దేశవ్యాప్తంగా వై-ఫై సేవలు..!

PM WANI Scheme: దేశ వ్యాప్తంగా ఉచిత ఇంటెర్నెట్ ఇచ్చేందుకు ట్రాయ్ సిద్ధమైంది. అలాగే ఓకే పాస్‌వర్డ్‌తో దేశ వ్యాప్తంగా వైఫై సేవలు అందించాలని చూస్తోంది.

Venkat
Published on: 7 May 2026 8:02 PM IST
PM-WANI
X

PM-WANI: భారత్‌లో ఉచిత ఇంటర్నెట్ విప్లవం.. ఒకే పాస్‌వర్డ్‌తో దేశవ్యాప్తంగా వై-ఫై సేవలు..!

Public WiFi Hotspots: భారతదేశ డిజిటల్ రూపురేఖలను మార్చేలా భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా 4 లక్షల వై-ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసి, పౌరులకు సులభంగా, ఉచితంగా ఇంటర్నెట్ అందించడమే దీని లక్ష్యం. ప్రతిచోటా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా, ఒకే పాస్‌వర్డ్‌తో దేశం మొత్తం ఇంటర్నెట్ వాడుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పీఎం-వాణి (ప్రధాన మంత్రి వై-ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్) పథకాన్ని మరింత ఆధునీకరించాలని ట్రాయ్ భావిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా సులభంగా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేలా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నారు. దీని ద్వారా ఖరీదైన మొబైల్ డేటాపై ఆధారపడటం తగ్గి, సామాన్యులకు సైతం హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది.

ఒకే లాగిన్.. దేశవ్యాప్త సేవలు..

ట్రాయ్ ప్రతిపాదించిన ఈ కొత్త విధానంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం 'సింగిల్ లాగిన్' సౌకర్యం. సాధారణంగా పబ్లిక్ వై-ఫై వాడేటప్పుడు ప్రతిసారీ ఓటీపీ నమోదు చేయడం లేదా లాగిన్ అవ్వడం వినియోగదారులకు విసుగు కలిగిస్తుంది. అయితే, ఈ కొత్త వ్యవస్థలో వినియోగదారుడు ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు, దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న 4 లక్షల హాట్‌స్పాట్‌ల వద్ద ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా భద్రతను కూడా పెంచుతుంది.

రెవెన్యూ మోడల్..

గతంలో పబ్లిక్ వై-ఫై వ్యవస్థలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణం ఆపరేటర్లకు సరైన ఆదాయం లేకపోవడం. దీనిని గమనించిన ట్రాయ్, ఈసారి పటిష్టమైన వ్యాపార నమూనాను సిద్ధం చేస్తోంది. ఇందులో ప్రకటనల ఆధారిత మోడల్, తక్కువ ధరల పెయిడ్ ప్లాన్లు, ప్రభుత్వ రాయితీలు వంటివి ఉండే అవకాశం ఉంది. దీనివల్ల చిన్న వ్యాపారులు, స్థానిక ఆపరేటర్లు వై-ఫై కేంద్రాలను నిర్వహించడం ద్వారా ఆదాయం పొందవచ్చు. నగరాల్లో హై-స్పీడ్ నెట్‌వర్క్, గ్రామాల్లో తక్కువ ఖర్చుతో కూడిన కమ్యూనిటీ వై-ఫై మోడల్‌ను అమలు చేయనున్నారు.

సామాన్యులకు చేకూరే ప్రయోజనాలు..

ప్రస్తుతం భారతదేశంలో కేవలం 2 శాతం మంది మాత్రమే పబ్లిక్ వై-ఫై ఉపయోగిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలైన దక్షిణ కొరియా (80%), అమెరికా (70%) లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. పబ్లిక్ వై-ఫై అందుబాటులోకి వస్తే మొబైల్ నెట్‌వర్క్‌లపై భారం తగ్గుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్న వ్యాపారులు, పేద వర్గాలకు ఇది గొప్ప వరం. వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ సేవలు, ఇతర డిజిటల్ సేవల కోసం ఈ హై-స్పీడ్ నెట్‌వర్క్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఈ-గవర్నెన్స్ సేవలను ప్రతి పౌరుడికి చేరవేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story