Truecallerకు TRAI షాక్.. ఇక ఆ నంబర్లపై స్పామ్ ట్యాగ్ కుదరదు.!

టెలికాం రంగంలో స్పామ్ , ప్రమోషనల్ కాల్స్ నియంత్రణపై భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (TRAI), ప్రముఖ కాలర్ ఐడీ యాప్ 'ట్రూకాలర్' (Truecaller) మధ్య వివాదం

G Krishna
Published on: 13 July 2026 6:15 PM IST
trai-truecaller
X

trai-truecaller

టెలికాం రంగంలో స్పామ్ , ప్రమోషనల్ కాల్స్ నియంత్రణపై భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (TRAI), ప్రముఖ కాలర్ ఐడీ యాప్ 'ట్రూకాలర్' (Truecaller) మధ్య వివాదం ముదిరింది. 140, 1600 సిరీస్‌లతో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్లను థర్డ్-పార్టీ యాప్స్ స్పామ్‌గా ట్యాగ్ చేయడం, బ్లాక్ చేయడంపై ట్రాయ్ ఇటీవల కీలక స్పష్టతనిచ్చింది. ఈ నంబర్ల విషయంలో కాలర్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లపై చర్యలు తీసుకునేందుకు వీలుగా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నుండి అదనపు అధికారాలను కూడా ట్రాయ్ కోరినట్లు తెలుస్తోంది.

‘1600’ సిరీస్ నంబర్లను బ్లాక్ చేయడం అస్సలు కుదరదు!

కస్టమర్స్ భద్రత, బ్యాంకింగ్ లావాదేవీల నమ్మకం కోసమే ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు ట్రాయ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ వంటి ప్రభుత్వ సంస్థల పరిధిలో పనిచేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు , బీమా కంపెనీలు తమ కస్టమర్లకు సర్వీస్ లేదా ట్రాన్సాక్షన్ అలర్ట్స్ (ఓటీపీలు, పేమెంట్ అప్‌డేట్స్) పంపడానికి కేవలం '1600' సిరీస్ నంబర్లను మాత్రమే వాడాలని ట్రాయ్ నిర్దేశించింది.

అంతేకాకుండా, ప్రభుత్వం ప్రజలకు అందించే అధికారిక సమాచారం కోసం కూడా ఈ 1600 సిరీస్ నంబర్లనే కేటాయించారు. అందువల్ల, ఇవి అత్యంత కీలకమైన అధికారిక కాల్స్ కాబట్టి వీటిని ఏ యాప్ కూడా స్పామ్‌గా చూపించకూడదని, అలాగే బ్లాక్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం చట్టరీత్యా చెల్లదని ట్రాయ్ తేల్చిచెప్పింది.

'140' సిరీస్ నంబర్లను వినియోగదారులే బ్లాక్ చేసుకోవచ్చు

మరోవైపు, టెలిమార్కెటర్లు చేసే ప్రమోషనల్ లేదా అడ్వర్టైజ్‌మెంట్ కాల్స్ కోసం '140' సిరీస్ నంబర్లను కేటాయించారు. ఈ సంస్థలు టెలికాం రూల్స్ ప్రకారం రిజిస్టర్ చేసుకుని ఈ నంబర్లను పొందుతాయి. అయితే, ఈ 140 సిరీస్ కాల్స్‌ను కూడా ట్రూకాలర్ లాంటి థర్డ్-పార్టీ యాప్స్ నేరుగా బ్లాక్ చేయడానికి లేదా స్పామ్‌గా మార్క్ చేయడానికి వీల్లేదు.

కస్టమర్లకు ఈ కాల్స్ వద్దనుకుంటే, వారు నేరుగా ప్రభుత్వ 'డూ నాట్ డిస్టర్బ్' (DND) రిజిస్ట్రీలో లేదా ట్రాయ్ అధికారిక డీఎన్‌డీ యాప్ ద్వారా తమ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ కస్టమర్ ఒక నిర్దిష్ట రంగానికి చెందిన ప్రమోషనల్ కాల్స్ వద్దని డీఎన్‌డీలో బ్లాక్ చేస్తే, ఆ రంగం నుండి వచ్చే 140 సిరీస్ కాల్స్ ఆటోమేటిక్‌గా నిలిచిపోతాయి. అంతే తప్ప, యాప్స్ తమ సొంత కమ్యూనిటీ రిపోర్ట్స్ ఆధారంగా ఈ నంబర్లపై స్పామ్ లేబుల్ వేస్తే, నిజంగా ఆ సమాచారం కావాలనుకునే కస్టమర్లు మోసపోయే అవకాశం ఉందని ట్రాయ్ వాదిస్తోంది.

ట్రాయ్ నిర్ణయంపై ట్రూకాలర్ తీవ్ర అసంతృప్తి

ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రూకాలర్ ఇండియా ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రాయ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాము 140, 1600 సిరీస్ నంబర్లపై 'స్పామ్' వార్నింగ్ లను చూపించడం నిలిపివేశామని (వైట్‌లిస్టింగ్ చేశామని) సంస్థ పేర్కొంది. అయితే దీనివల్ల స్పామర్లు, స్కామర్లు ఈ నంబర్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం భారతదేశంలో ప్రతిరోజూ కోట్లాది 140, 1600 సిరీస్ కాల్స్ కస్టమర్ల నుండి ఎలాంటి సమాధానం లేకుండా పోతున్నాయని కంపెనీ తెలిపింది. కస్టమర్లు స్వచ్ఛందంగా రోజుకు లక్షలాది కాల్స్‌ను మ్యాన్యువల్‌గా బ్లాక్ చేస్తున్నారని వెల్లడించింది. ఎంతోమంది ప్రజలు ఇవి స్పామ్ అని భావిస్తున్నా, తాము వాటిని స్పామ్‌గా చూపించలేకపోవడం వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా, ఈ సరికొత్త రూల్స్ వల్ల సాధారణ మొబైల్ యూజర్లకు మేలు జరుగుతుందా లేదా స్పామ్ కాల్స్ మరింత పెరుగుతాయా అనేది చూడాలి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story