వివో నుంచి అదిరిపోయే ఫోన్ లాంచ్.. 10,000mAh బ్యాటరీతోపాటు మరెన్నో ఫీచర్లు..!

Vivo Y600 Price: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Vivo మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో Y600 పేరుతో చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో భారీ 10,000mAh బ్యాటరీ ఇచ్చారు. దీనికి తోడు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వచ్చిన ఈ ఫోన్ ధర కూడా ఆసక్తికరంగా ఉంది.

Venkat
Updated on: 27 Oct 2026 9:22 PM IST
Vivo Y600 Price
X

వివో నుంచి అదిరిపోయే ఫోన్ లాంచ్.. 10,000mAh బ్యాటరీతోపాటు మరెన్నో ఫీచర్లు..!

Vivo Y600 Price: వివో తన Y సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. వివో Y600 పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో ఏకంగా 10,000mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందించారు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000mAh నుంచి 6,000mAh బ్యాటరీలు కనిపిస్తుంటే.. వివో Y600లో మాత్రం దీనికి చాలా ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

బ్యాటరీతో పాటు డ్యూరబిలిటీకి కూడా కంపెనీ ప్రాధాన్యత ఇచ్చింది. వివో Y600 ఏడు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ బెంచ్‌మార్క్‌లను పూర్తి చేసిందని కంపెనీ వెల్లడించింది. ఒక మీటర్ ఎత్తు నుంచి ఫోన్‌ను పలుమార్లు కింద పడేసి పరీక్షించినట్లు తెలిపింది. దీంతో ఇది డ్రాప్ రెసిస్టెంట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది.

IP68+IP69 రేటింగ్

వివో Y600కు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+IP69 రేటింగ్స్ ఇచ్చారు. అధిక ఉష్ణోగ్రతలు, హై ప్రెజర్ వాటర్ జెట్స్‌ను కూడా ఈ ఫోన్ తట్టుకోగలదని కంపెనీ చెబుతోంది. 24 గంటల పాటు నీటిని ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఉన్నట్లు పేర్కొంది.

1.5K 120Hz డిస్‌ప్లే

వివో Y600లో 6.83 ఇంచుల 1.5K డిస్‌ప్లే అందించారు. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ సమయంలో స్క్రీన్ అనుభవం మరింత స్మూత్‌గా ఉండేలా ఈ అధిక రిఫ్రెష్ రేట్ ఉపయోగపడుతుంది. డిస్‌ప్లేకు SGS సర్టిఫికేషన్ కూడా లభించింది. ఇది లో బ్లూ లైట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

MediaTek Dimensity 7300e ప్రాసెసర్

పనితీరు కోసం వివో Y600లో మీడియా టెక్ డైమెన్సిటీ 7300e చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 6GB, 8GB LPDDR4X ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. స్టోరేజ్ పరంగా 128GB, 256GB UFS 3.1 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజన్ ఓఎస్ 6పై ఫోన్ పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా అందించారు.

50MP కెమెరా

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరాను Sony IMX852 సెన్సార్‌తో అందించారు. ఈ కెమెరాకు f/1.8 అపర్చర్ ఉంది. దీంతో తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫొటోలు తీసేందుకు అవకాశం ఉంటుంది. వెనుక భాగంలో Aura Light కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు. దీనికి f/2.0 అపర్చర్ ఉంది.

10,000mAh బ్యాటరీ.. 44W ఫాస్ట్ ఛార్జింగ్

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 10,000mAh బ్యాటరీ. ఇంత భారీ బ్యాటరీతో ఎక్కువ సమయం ఫోన్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసేందుకు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, USB Type-C పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

వివో Y600 ధర ఎంత?

వివో Y600ను చైనాలో నాలుగు వేరియంట్లలో లాంచ్ చేశారు. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 28,495గా ఉంటుంది.

టాప్ వేరియంట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర 2,499 యువాన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 35,000. అయితే ఈ ధరలు చైనా లాంచ్ ధరల ఆధారంగా చేసిన మార్పిడి మాత్రమే. భారత మార్కెట్లో వివో Y600 ఎప్పుడు విడుదలవుతుంది, ఏ ధరకు వస్తుంది అనే వివరాలను కంపెనీ ప్రకటించాల్సి ఉంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.