Disable Bloatware Android: స్మార్ట్‌ఫోన్ సతాయిస్తోందా..? ఈ చిన్న టిప్ తో రాకెట్ కన్నా వేగంతో పనిచేయడం పక్కా.!
Disable Bloatware Android: కొత్త ఫోన్లు చాలా స్పీడ్ గా పనిచేస్తుంటాయి. కాలక్రమంలో అవి స్పీడ్ తగ్గి చిరాకు పుట్టిస్తుంటాయి. అయితే, మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే, ఈ చిన్న టిప్ తో ఆ సమస్యకు చెక్ పెట్టోచ్చన్నమాట.
Disable Bloatware Android
What is Bloatware: కొత్తగా కొన్నప్పుడు ఎంతో వేగంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్, కొన్ని నెలలకే సతాయించడం మొదలుపెడుతోంది. దీనికి ప్రధాన కారణం ఫోన్‌లో ఉండే అప్లికేషన్‌లు. వీటినే సాంకేతిక పరిభాషలో 'బ్లోట్‌వేర్' అంటారు. ఇవి మీకు తెలియకుండానే ఫోన్ స్టోరేజ్ సామర్థ్యాన్ని, బ్యాటరీని, వేగాన్ని హరించివేస్తాయి. అసలు ఈ బ్లోట్‌వేర్ అంటే ఏమిటి, దీని వల్ల కలిగే నష్టాలు, దీనిని ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లోట్‌వేర్ అంటే ఏమిటి?
మనం ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు, అందులో తయారీ సంస్థలు ముందుగానే కొన్ని అప్లికేషన్‌లను ఇస్తాయి. వీటిలో కంపెనీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లతో పాటు కొన్ని ఇతర సంస్థల అప్లికేషన్‌లు కూడా ఉంటాయి. వీటిని వినియోగదారుడు స్వయంగా డౌన్‌లోడ్ చేయకపోయినా ఫోన్‌లోనే ఉంటాయి. ఇవే బ్లోట్‌వేర్. ఇవి వినియోగదారులకు పెద్దగా ఉపయోగపడవు, కానీ ఫోన్ స్టోరేజీని తగ్గిస్తుంటాయి.
స్మార్ట్‌ఫోన్ వేగంతోపాటు బ్యాటరీపై ప్రభావం..
బ్లోట్‌వేర్ కేవలం మెమరీని మాత్రమే కాదు, ఇది ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ లో నిరంతరం నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఫోన్ ప్రాసెసర్ మీద అదనపు భారం పడుతుంది. ఫలితంగా ఫోన్ వేగం తగ్గి, పనిచేసేటప్పుడు ల్యాగింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా, ఈ అప్లికేషన్‌లు నిరంతరం ఇంటర్నెట్‌ను, బ్యాటరీని వాడుకోవడం వల్ల ఛార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. చాలా మంది ఫోన్ పాడైందని అనుకుంటారు. కానీ అసలు కారణం ఈ అనవసర అప్లికేషన్‌లే.
బ్లోట్‌వేర్‌ను గుర్తించడం ఎలా?
మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన అప్లికేషన్‌ల జాబితాను ఒకసారి చూడండి. వాటిలో మీరు గత కొన్ని నెలలుగా అస్సలు ఉపయోగించని అప్లికేషన్‌లు ఏవైనా ఉంటే, వాటినే బ్లోట్‌వేర్ అని గుర్తించాలి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'యాప్స్' విభాగంలో ఏ అప్లికేషన్ ఎంత డేటాను, ఎంత స్టోరేజ్‌ను వాడుతుందో చెక్ చేయడం ద్వారా వీటిని సులభంగా గుర్తించవచ్చు.
బ్లోట్‌వేర్ నుంచి బయటపడే మార్గాలు..
ఈ అవసరం లేని అప్లికేషన్‌లను తొలగించడం ద్వారా మీ ఫోన్ వేగాన్ని మళ్ళీ పుంజుకునేలా చేయవచ్చు. అందుకు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.
అన్‌ఇన్‌స్టాల్ చేయండి: కొన్ని అప్లికేషన్‌లను మనం నేరుగా డిలీట్ చేయవచ్చు. అలాంటి వాటిని వెంటనే తొలగించండి.
డిసేబుల్ చేయండి: కొన్ని కంపెనీ అప్లికేషన్‌లను మనం డిలీట్ చేయలేం. అటువంటప్పుడు వాటిని 'డిసేబుల్' చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అవి బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేయవు, డేటాను వాడవు.
క్యాచీ మెమరీని క్లియర్ చేయండి: తరచుగా అప్లికేషన్‌ల క్యాచీ మెమరీని శుభ్రం చేయడం వల్ల ఫోన్ మెమరీ ఖాళీ అవుతుంది.
మెరుగైన పనితీరు కోసం చిన్న చిట్కా..
మీ ఫోన్ స్టోరేజ్ సమస్యల నుంచి బయటపడాలంటే, బ్లోట్‌వేర్‌ను నియంత్రించడం ఉత్తమ మార్గం. దీనివల్ల ఫోన్ మెమరీ ఖాళీ అవ్వడమే కాకుండా, సిస్టమ్ మీద ఒత్తిడి తగ్గి ఫోన్ ఎంతో సాఫీగా పనిచేస్తుంది. ఫోన్ స్లో అయినప్పుడు కొత్తది కొనాలని ఆలోచించే ముందు, ఒకసారి ఈ బ్లోట్‌వేర్ అప్లికేషన్‌లను తొలగించి చూడడం మంచిది.




