వాట్సాప్‌లోనూ 'ఇన్‌కాగ్నిటో మోడ్'.. మీ చాటింగ్ ఇకపై ఫుల్ సీక్రెట్..!
WhatsApp Incognito Mode: సాధారణంగా ఇంటర్నెట్‌లో ఏదైనా వ్యక్తిగత విషయాల గురించి వెతకాలంటే మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోని ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఆశ్రయిస్తాం.
వాట్సాప్‌లోనూ 'ఇన్‌కాగ్నిటో మోడ్'.. మీ చాటింగ్ ఇకపై ఫుల్ సీక్రెట్..!
WhatsApp Incognito Mode: సాధారణంగా ఇంటర్నెట్‌లో ఏదైనా వ్యక్తిగత విషయాల గురించి వెతకాలంటే మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోని ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఆశ్రయిస్తాం. ఇప్పుడు అదే స్థాయి భద్రతను మెటా తన వాట్సాప్ వినియోగదారులకు కల్పిస్తోంది. మెటా ఏఐతో వినియోగదారులు జరిపే చర్చలు రికార్డ్ అవుతాయనే భయం లేకుండా ఈ సరికొత్త ఫీచర్‌ను రూపొందించారు. దీనివల్ల వినియోగదారుడి గోప్యతకు భంగం కలగకుండా సంభాషణలు సాగించవచ్చు.
జుకర్‌బర్గ్ కూడా చదవలేరు..
ఈ ఫీచర్ గురించి మార్క్ జుకర్‌బర్గ్ తన వాట్సాప్ ఛానల్ ద్వారా కీలక వివరాలు వెల్లడించారు. సాధారణ సందేశాల మాదిరిగానే ఈ ఇన్‌కాగ్నిటో చాట్స్ కూడా 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్' పద్ధతిలో పనిచేస్తాయి. అంటే వినియోగదారుడు, ఏఐ మధ్య జరిగే సంభాషణను మెటా యాజమాన్యం లేదా వాట్సాప్ ఉద్యోగులు, ఆఖరికి జుకర్‌బర్గ్ కూడా చూడలేరు. ఇది వినియోగదారులకు పూర్తి స్థాయి వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తుంది.
టీఈఈ సాంకేతికతతో పటిష్ట భద్రత..
ఈ ఇన్‌కాగ్నిటో చాట్ ఫీచర్ 'ట్రస్టెడ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్' (TEE) అనే అధునాతన సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ ఏఐ అభ్యర్థనలను ఒక ప్రత్యేకమైన ఐసోలేషన్‌లో ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల డేటా కంపెనీ ప్రధాన సర్వర్‌లకు చేరే అవకాశం ఉండదు. వినియోగదారుడు చాట్ సెషన్‌ను ముగించిన వెంటనే ఆ సంభాషణ ఫోన్ నుంచి, సర్వర్ల నుంచి శాశ్వతంగా తొలగించబడుతుంది. ఇతర యాప్‌లలో లాగ్‌లు కొన్ని వారాల పాటు సర్వర్‌లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మెటా ఏఐలో మాత్రం ఒక్క క్షణం కూడా డేటా నిల్వ ఉండదు.
వ్యక్తిగత స్పేస్ అవసరం..
భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారుతుందని, అటువంటి సమయంలో వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ప్రత్యేకమైన ప్రైవేట్ స్పేస్ అవసరమని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. భయం లేకుండా వినియోగదారులు తమ వ్యక్తిగత విషయాలను ఏఐతో చర్చించేలా చేయడమే ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లక్ష్యం. సర్వర్ సైడ్ లాగ్ రిటెన్షన్ లేకుండా ప్రైవేట్ ఏఐ ఇంటరాక్షన్‌ను అందిస్తున్న ప్రపంచంలోనే మొదటి సంస్థగా మెటా నిలిచింది.
అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు?
ప్రస్తుతం ఈ ఫీచర్ రోల్ అవుట్ ప్రక్రియ ప్రారంభమైంది. వాట్సాప్, మెటా ఏఐ యాప్ బీటా వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంది. భారతీయ వినియోగదారులకు సంబంధించి ఖచ్చితమైన తేదీ తెలియనప్పటికీ, రాబోయే కొన్ని వారాల్లో అందరికీ ఈ సరికొత్త ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.




