స్టేటస్‌లో ఫుల్ సైజ్ ఫోటోలు పెట్టుకోవాలా.. వాట్సాప్ కొత్త అప్‌డేట్ చూస్తే వావ్ అనాల్సిందే..

WhatsApp: మనం ఏదైనా ఫోటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాలన్నా, ఇతరులకు పంపాలన్నా క్రాప్ చేయాల్సి రావడం ఎంతో విసుగు తెప్పిస్తుంది.

Venkat
Published on: 19 Aug 2026 10:34 PM IST
WhatsApp
X

స్టేటస్‌లో ఫుల్ సైజ్ ఫోటోలు పెట్టుకోవాలా.. వాట్సాప్ కొత్త అప్‌డేట్ చూస్తే వావ్ అనాల్సిందే..

WhatsApp: మనం ఏదైనా ఫోటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాలన్నా, ఇతరులకు పంపాలన్నా క్రాప్ చేయాల్సి రావడం ఎంతో విసుగు తెప్పిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మెటా సంస్థ అదిరిపోయే ఏఐ ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఏ ఫోటోనైనా సులభంగా 9:16 ఫార్మాట్‌కి మార్చే సరికొత్త టూల్ త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రాబోతోంది.

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ వినియోగదారుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వినూత్న ఫీచర్లను పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా 'ఫోటో ఎక్స్‌పాన్షన్' టూల్‌ను తీసుకురానుంది. Wabetainfo నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.33.2లో పరీక్షల దశలో ఉంది. ఈ కొత్త టూల్ సాయంతో యూజర్లు తమ ఫోటోలను స్టాండర్డ్ ఫుల్ స్క్రీన్ సైజ్ అయిన 9:16 రేషియోకి సులభంగా మార్చుకోవచ్చు. దీనికోసం థర్డ్ పార్టీ యాప్స్ వాడాల్సిన అవసరం ఉండదు. యాప్‌లోని డ్రాయింగ్ ఎడిటర్ స్క్రీన్‌లోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది.

ఎలా పనిచేస్తుందంటే?

డ్రాయింగ్ ఎడిటర్‌లో యానిమేట్, బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్లతో పాటే ఈ కొత్త ఎక్స్‌పాన్షన్ టూల్ కూడా కనిపిస్తుంది. యూజర్లు ఏదైనా ఫోటోను ఎంచుకుని ఈ టూల్‌పై క్లిక్ చేయగానే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మెటా ఏఐ వెంటనే ఆ ఇమేజ్‌ను విశ్లేషించి, ఫోటో అంచుల చుట్టూ నేపథ్యానికి సరిపోయే కంటెంట్‌ను కృత్రిమంగా సృష్టిస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆ ఫోటో 9:16 సైజుకు మారిపోతుంది. ఒకవేళ ఏఐ సృష్టించిన రిజల్ట్ నచ్చకపోతే, వినియోగదారులు ఆ టూల్‌ను మళ్లీ వినియోగించి వేరే రిజల్ట్ కోసం ప్రయత్నించవచ్చు.

త్వరలో మరిన్ని ఫీచర్లు..

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఫోటో ఎక్స్‌పాన్షన్ ఫీచర్‌ను ముందుగా స్టేటస్ అప్‌డేట్స్ కోసం మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా పర్సనల్ చాట్స్‌లో కూడా ఫోటోలు పంపుకునేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్తులో వచ్చే కొత్త అప్‌డేట్‌తో అందరు బీటా టెస్టర్లకు ఇది చేరువ కానుంది. దీంతో పాటే ఐఓఎస్ యూజర్ల కోసం యానిమేటెడ్ వాల్‌పేపర్లతో కూడిన చాట్ థీమ్స్, పోల్ ఫీచర్‌లో మార్పులు, గ్రూపుల్లో అందరినీ ఒకేసారి మెన్షన్ చేసే '@all' ఫీచర్‌ను కూడా వాట్సాప్ త్వరలో పరిచయం చేయనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత సమర్థవంతంగా వాడుకుంటూ వాట్సాప్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తోంది. ఈ కొత్త 9:16 ఇమేజ్ ఎక్స్‌పాన్షన్ టూల్ అందుబాటులోకి వస్తే, క్రాపింగ్ సమస్యలు తీరిపోయి ఫోటో షేరింగ్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story