వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. స్టోరేజ్ సమస్యలకు గుడ్ బై.. ఇకపై గూగుల్ డ్రైవ్ తో పనిలే..

WhatsApp Cloud Storage Update: మీ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ నిండిపోయి వాట్సాప్ బ్యాకప్ ఆగిపోయిందా? అదనపు మెమరీ కోసం డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసం వాట్సాప్ ఒక అద్భుతమైన వార్తను మోసుకొస్తోంది.

Venkat
Published on: 30 April 2026 10:38 AM IST
WhatsApp Cloud Storage Update
X

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. స్టోరేజ్ సమస్యలకు గుడ్ బై.. ఇకపై గూగుల్ డ్రైవ్ తో పనిలే..

WhatsApp Cloud Storage Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మక మార్పును చేపట్టబోతోంది. సాధారణంగా మన వాట్సాప్ సందేశాలు, ఫోటోలు, వీడియోలను భద్రపరుచుకోవడానికి గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ వంటి సేవలను వాడుతుంటాము. అయితే, గూగుల్ ఉచితంగా ఇచ్చే 15 జీబీ పరిమితి త్వరగానే నిండిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మెటా సంస్థ ఇప్పుడు సొంతంగా ఎన్‌క్రిప్టెడ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది.

ఉచిత, పేమెంట్ సేవలు అందుబాటులోకి..

తాజా సమాచారం ప్రకారం, వాట్సాప్ తన వినియోగదారులకు ప్రాథమికంగా 2 జీబీ వరకు ఉచిత స్టోరేజ్‌ను అందించే అవకాశం ఉంది. ఒకవేళ మీ డేటా అంతకంటే ఎక్కువగా ఉంటే, తక్కువ ధరకే అదనపు స్టోరేజ్‌ను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించనున్నారు. నెలకు సుమారు 80 నుంచి 94 రూపాయల లోపు ధరలోనే దాదాపు 50 జీబీ వరకు డేటాను దాచుకునే ప్లాన్లను కంపెనీ పరిశీలిస్తోంది. దీనివల్ల గూగుల్ డ్రైవ్ నిండిపోయినా మీ చాట్ బ్యాకప్ ఆగిపోదు.

పాస్ కీ ఫీచర్‌తో రెట్టింపు రక్షణ..

కేవలం స్టోరేజ్ మాత్రమే కాకుండా, భద్రత విషయంలోనూ వాట్సాప్ రాజీ పడటం లేదు. కొత్త క్లౌడ్ వ్యవస్థలో వినియోగదారులు తమ బ్యాకప్‌ను 'పాస్ కీ' ఫీచర్ ద్వారా భద్రపరుచుకోవచ్చు. అంటే ఇకపై పెద్ద పెద్ద పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. మీ ఫోన్ ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ లేదా స్క్రీన్ లాక్ సహాయంతోనే సులభంగా డేటాను రీస్టోర్ చేసుకోవచ్చు. ఇది హ్యాకర్ల నుంచి మీ వ్యక్తిగత సమాచారానికి పటిష్టమైన రక్షణ కల్పిస్తుంది.

ఎంపిక మీదే..

వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, పాత పద్ధతిని పూర్తిగా తొలగించడం లేదు. వినియోగదారులు తమకు నచ్చితే గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌ను కొనసాగించవచ్చు లేదా వాట్సాప్ అందిస్తున్న కొత్త క్లౌడ్ స్టోరేజ్‌కు మారిపోవచ్చు. ఈ అప్‌డేట్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఈ మార్పుతో స్టోరేజ్ ఫుల్ అనే నోటిఫికేషన్ల నుంచి మనకు విముక్తి లభించనుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story