WhatsApp: వాట్సాప్ యూజర్లకు పండగే.. చాటింగే కాదు బిల్లులు కూడా కట్టొచ్చు

వాట్సాప్ త్వరలో సరికొత్త ఫీచర్లతో సూపర్ యాప్‌గా మారనుంది. కొత్త బాస్ కునాల్ షా ఆధ్వర్యంలో యాప్ నుంచే కరెంట్ బిల్లులు చెల్లించడం, లోన్లు తీసుకోవడం లాంటి సదుపాయాలు రానున్నాయి.

CR Reddy
Published on: 12 Nov 2026 9:36 AM IST
WhatsApp
X

WhatsApp

WhatsApp: వాట్సాప్ అంటే కేవలం గుడ్ మార్నింగ్ మెసేజులు, ఫోటోలు పంపుకునే యాప్ మాత్రమే కాదు. త్వరలోనే ఇది మీ రోజువారీ పనులన్నింటినీ చక్కబెట్టే సూపర్ యాప్‌గా మారబోతోంది. వాట్సాప్ కొత్త బాస్ కునాల్ షా ఈ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడం, రోజువారీ పనులను సులభతరం చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని పెంచడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో వాట్సాప్ టీమ్ పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. జూన్‌లో విల్ క్యాథ్‌కార్ట్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన కునాల్ షా భారతీయ ఫిన్‌టెక్ దిగ్గజం CRED ఫౌండర్‌గా అందరికీ సుపరిచితమే.

యాప్ మారకుండానే బిల్లులు, అప్పులు

మనం కరెంట్ బిల్లు కట్టాలన్నా, ఏదైనా లోన్ తీసుకోవాలన్నా వేరే యాప్స్ ఓపెన్ చేస్తుంటాం. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. బ్యాంకింగ్, టెలికాం కంపెనీలతో వాట్సాప్ జతకడుతోంది. దీనివల్ల వాట్సాప్ చాట్ విండో నుంచే కరెంటు, నీటి బిల్లులు సులభంగా చెల్లించవచ్చు. అవసరమైతే లోన్ కూడా తీసుకునే సదుపాయం రాబోతోంది. విదేశీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు మొబైల్ కనెక్టివిటీకి సంబంధించిన పనులను కూడా ఈ యాప్ ద్వారానే ఈజీగా మేనేజ్ చేసుకునేలా వాట్సాప్ కొత్త ఫీచర్లు తీసుకురానుంది.

పనులన్నీ చిటికెలో చేసే ఏఐ మ్యాజిక్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని వాట్సాప్‌లో భారీగా పెంచబోతున్నారు. మీకు కావాల్సిన సమాచారాన్ని వెతకడం నుంచి డాక్టర్ అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, ముఖ్యమైన పనులను గుర్తుచేయడం (రిమైండర్లు) వరకు అంతా ఏఐ చూసుకుంటుంది. రోజువారీ జీవితంలో మనం పడే చిన్నచిన్న టెన్షన్లను ఈ ఏఐ ఫీచర్లు మాయం చేయబోతున్నాయి. యూజర్లు అడిగిన వెంటనే ఖచ్చితమైన సమాచారాన్ని అందించేలా ఏఐ టూల్స్‌ను మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు.

కాలింగ్ అనుభవం మరింత సూపర్

ప్రస్తుతం వాట్సాప్‌లో ప్రతిరోజూ 10 బిలియన్లకు పైగా వాయిస్ మెసేజులు, 4 బిలియన్లకు పైగా స్టిక్కర్లు షేర్ అవుతున్నాయి. రోజూ 2 బిలియన్లకు పైగా వాయిస్, వీడియో కాల్స్ నడుస్తున్నాయి. ఇంత భారీ ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో వాయిస్ మెసేజులు, గ్రూప్ చాట్స్, వీడియో కాలింగ్ క్వాలిటీని మరింత పెంచబోతున్నారు. ఇన్ని కొత్త ఫీచర్లు వస్తున్నా సరే, యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని కునాల్ షా స్పష్టం చేశారు. ఎప్పటిలాగే మీ మెసేజులు, కాల్స్ అన్నీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతోనే ఉంటాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.