WhatsAppలో అదిరిపోయే సెక్యూరిటీ అప్‌డేట్.. ఇక పాస్‌కీతో మరింత సేఫ్.!

వాట్సాప్ యూజర్ల సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేలా మెటా కీలక ఫీచర్లను ప్రకటించింది. ఇప్పటికే పాస్‌కీ ఫీచర్‌ను ఉపయోగిస్తున్న యూజర్ల సంఖ్య 100 కోట్లకు..

G Krishna
Published on: 26 Aug 2026 1:27 PM IST
WhatsApp-passkey-security-u
X

WhatsApp-passkey-security-u

వాట్సాప్ యూజర్ల సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేలా మెటా కీలక ఫీచర్లను ప్రకటించింది. ఇప్పటికే పాస్‌కీ ఫీచర్‌ను ఉపయోగిస్తున్న యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంది. దీంతో పాటు ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో ఉపయోగించే వారికి ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలను యాడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే 2FAలో కొత్త పాస్‌వర్డ్ ఆప్షన్, తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌పై అదనపు సమాచారం అందించే కొత్త కాల్ స్క్రీనింగ్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది.

100 కోట్ల మందికి పాస్‌కీ సెక్యూరిటీ

వాట్సాప్ తొలిసారిగా 2023లో ఆండ్రాయిడ్ యూజర్లకు పాస్‌కీ సపోర్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024లో ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. పాస్‌కీ ద్వారా వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యేందుకు ఫోన్ పాస్‌వర్డ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ వంటి బయోమెట్రిక్ ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు 100 కోట్లకు పైగా యూజర్లు పాస్‌కీలను ఎనేబుల్ చేసుకున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. చాట్ బ్యాకప్‌లకు కూడా పాస్‌కీ ఆధారిత ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఒక అకౌంట్‌కు పలు పాస్‌కీలు

ఇక ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు డివైజ్‌లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌ను లాగిన్ చేసి ఉపయోగించే వారికి కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఒకే అకౌంట్‌కు ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలను యాడ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో Settings > Account > Passkeysలోకి వెళ్లి కొత్త పాస్‌కీలను సెటప్ చేసుకోవచ్చు. దీంతో వేర్వేరు డివైజ్‌లకు ప్రత్యేక పాస్‌కీలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

2FAలో భారీ మార్పు

వాట్సాప్ టూ-స్టెప్ వెరిఫికేషన్‌లో కూడా కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు 2FA కోసం ఆరు అంకెల న్యూమరిక్ పిన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉండేది. ఇకపై యూజర్లు అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్లతో కూడిన పొడవైన పాస్‌వర్డ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది అకౌంట్‌కు అదనపు భద్రతను అందించడంతో పాటు సులభంగా ఊహించగలిగే పిన్‌ల వల్ల వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

తెలియని కాల్స్‌పై ఇక మరింత సమాచారం

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త స్మార్ట్ కాల్ స్క్రీనింగ్ ఫీచర్‌ను కూడా ప్రకటించింది. సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్ ఏ దేశానికి చెందినదో, అలాగే ఆ వ్యక్తితో యూజర్‌కు ఏదైనా మ్యూచువల్ గ్రూప్ ఉందో వంటి అదనపు వివరాలను యాప్ చూపిస్తుంది. స్కామర్లు సాధారణంగా అత్యవసర పరిస్థితిని సృష్టించి బాధితులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తెలియని కాలర్ గురించి ముందుగానే మరింత సమాచారం అందించడం ద్వారా యూజర్లు కాల్‌ను స్వీకరించాలా లేదా అనే నిర్ణయాన్ని మరింత జాగ్రత్తగా తీసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. పాస్‌కీలు, బలమైన 2FA పాస్‌వర్డ్‌లు, స్మార్ట్ కాల్ స్క్రీనింగ్ వంటి ఫీచర్లతో వాట్సాప్ యూజర్ల అకౌంట్ల భద్రతను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్స్, ఫేక్ కాల్స్ నేపథ్యంలో ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్లు యూజర్లకు ఉపయోగపడనున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story