WhatsApp: ఇక‌పై వాట్సాప్ వాడాలంటే నెల‌కు రూ. 79 చెల్లించాల్సిందేనా?

WhatsApp: ఎప్పటి నుంచో ఉచితంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ ఇప్పుడు తొలిసారి వాట్సాప్ ప్ల‌స్ పేరుతో చెల్లింపు సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది.

Mokshith
Published on: 26 Jun 2026 11:17 AM IST
WhatsApp
X

WhatsApp: ఇక‌పై వాట్సాప్ వాడాలంటే నెల‌కు రూ. 79 చెల్లించాల్సిందేనా?

WhatsApp: ఎప్పటి నుంచో ఉచితంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ ఇప్పుడు తొలిసారి వాట్సాప్ ప్ల‌స్ పేరుతో చెల్లింపు సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది. భారతీయ వినియోగదారుల కోసం ఈ ప్లాన్‌ను నెలకు రూ.79 ధరతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మెటా ప్రకటించింది.

వాట్సాప్ ప్లస్ అంటే ఏంటి.?

వాట్సాప్ ప్ల‌స్ అనేది వాట్సాప్‌కు సంబంధించిన కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్. దీని ద్వారా యాప్ రూపాన్ని, కొన్ని వ్యక్తిగత సెట్టింగ్‌లను మార్చుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్‌(iOS) వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. సాధారణంగా వాట్సాప్‌లో ఉన్న మెసేజింగ్, కాల్స్, స్టేటస్ వంటి ఫీచర్లు అందరికీ ఉచితంగానే కొనసాగుతాయి. ఈ ప్లాన్ తీసుకున్న వారికి అదనంగా కొన్ని ప్రత్యేక కస్టమైజేషన్ ఫీచర్లు మాత్రమే లభిస్తాయి.

రూ.79 ప్లాన్‌లో లభించే ప్రత్యేక ఫీచర్లు

వాట్సాప్ ప్ల‌స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటే యాప్‌ను మీకు నచ్చిన విధంగా మార్చుకునే ఎన్నో కొత్త అవకాశాలు లభిస్తాయి. మొత్తం 18 కొత్త కలర్ థీమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో Vibrant Blue, Royal Purple, Forest Green, Fuchsia Pink వంటి రంగులు ఉన్నాయి. సాధారణ వాట్సాప్ ఐకాన్‌కు బదులుగా 14 కొత్త యాప్ ఐకాన్లు ఎంచుకోవచ్చు. 10 ప్రత్యేక రింగ్‌టోన్లు లభిస్తాయి.

ప్రత్యేక స్టిక్కర్ ప్యాక్‌లు కూడా అందిస్తారు.

ఇప్పటివరకు ఉన్న పరిమితి కంటే ఎక్కువగా 20 చాట్‌లను పైభాగంలో పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

చాట్ లిస్టులను మీకు నచ్చిన విధంగా సృష్టించి, కస్టమైజ్ చేసుకునే అదనపు ఎంపికలు కూడా ఉంటాయి.

WhatsApp Plus ఎలా తీసుకోవాలి?

* ముందుగా WhatsApp యాప్‌ను ఓపెన్ చేయాలి.

* సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

* అక్కడ Subscriptions ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.

* అందులో WhatsApp Plus కనిపిస్తే దానిపై ట్యాప్ చేయాలి.

* తర్వాత కంటిన్యూ ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసుకొని, పేమెంట్ పూర్తి చేయాలి.

* పేమెంట్ ప్లే స్టోర్ లేదా సంబంధిత యాప్ స్టోర్ ద్వారా పూర్తవుతుంది.

* విజయవంతంగా స‌బ్‌స్క్రిప్ష‌న్‌ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది.

మొదటి నెల ఉచితం.. తర్వాత నెలకు రూ.79

వాట్సాప్ ప్లస్ తీసుకునే కొత్త వినియోగదారులకు మొదటి నెల పూర్తిగా ఉచితం. ఆ తర్వాత ప్రతి నెల రూ.79 చెల్లించాల్సి ఉంటుంది. స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకున్న తర్వాత అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్లను Settings > Subscriptions > WhatsApp Plusలో చూసి ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌తో ఉప‌యోగం ఏంటి.?

మీరు రోజంతా వాట్సాప్ ఎక్కువగా ఉపయోగిస్తూ, యాప్‌ను మీ అభిరుచికి తగ్గట్టు మార్చుకోవాలని అనుకుంటే వాట్సాప్ ప్లస్ ఉపయోగపడుతుంది. కొత్త థీమ్స్, ఐకాన్లు, రింగ్‌టోన్లు వంటి కస్టమైజేషన్ ఫీచర్లను ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్‌గా చెప్పొచ్చు. అయితే సాధారణ వాట్సాప్ వాడే వారికి ఈ ప్లాన్ తప్పనిసరి కాదు. ఎందుకంటే మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, స్టేటస్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి ప్రధాన ఫీచర్లు ఎలాంటి మార్పు లేకుండా అందరికీ ఉచితంగానే కొనసాగుతాయి. అంటే ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకోకపోయినా ముఖ్యమైన ఫీచర్లను కోల్పోయినట్టేం కాదు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story