WhatsApp: వాట్సప్ ఇక ఫ్రీ కాదు..వాడాలంటే నెల నెల డబ్బులు కట్టాల్సిందే..!
WhatsApp: వాట్సప్ త్వరలో వాట్సప్ ప్లస్ పేరుతో సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను పరిచయం చేయనుంది.
WhatsApp Plus Subscription: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పుడు ఒక సరికొత్త అవతారం ఎత్తబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా ఉచితంగా సేవలు అందించిన ఈ వేదిక, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ తరహాలోనే సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దీని పేరు వాట్సప్ ప్లస్. అసలు ఈ కొత్త ప్లాన్ ఏంటి? డబ్బులు కడితే వచ్చే అదనపు లాభాలేంటి? సామాన్య వినియోగదారులపై దీని ప్రభావం ఎంత? అనేది తెలుసుకుందాం.
డబ్బులు కట్టాల్సిందేనా?
సబ్‌స్క్రిప్షన్ అనగానే వాట్సప్ వాడాలంటే ఇకపై డబ్బులు కట్టాలేమో అని ఆందోళన చెందకండి. కంపెనీ క్లారిటీ ఇచ్చిన దాని ప్రకారం.. ప్రస్తుతం మనం వాడుతున్న మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ వంటి ఫీచర్లు ఎప్పటిలాగే పూర్తి ఉచితంగా కొనసాగుతాయి. ఈ సబ్‌స్క్రిప్షన్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. అంటే మీకు అదనపు హంగులు కావాలనుకుంటేనే డబ్బులు చెల్లించవచ్చు.
వాట్సప్ ప్లస్‌లో దొరికే స్పెషల్ ఫీచర్లు
డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారికి వాట్సప్ కొన్ని ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. ప్రస్తుతం మనం కేవలం మూడు చాట్‌లను మాత్రమే టాప్‌లో పిన్ చేసుకోగలం. కానీ సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఏకంగా 20 చాట్‌ల వరకు పిన్ చేసుకోవచ్చు.యాప్ లుక్‌ని మార్చేందుకు 18 రకాల సరికొత్త కలర్ థీమ్స్ అందుబాటులోకి వస్తాయి. హోమ్ స్క్రీన్‌పై వాట్సప్ ఐకాన్‌ను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. మెసేజ్ పంపేటప్పుడు ఆకట్టుకునే యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లు లభిస్తాయి. ఒక్కో కాంటాక్ట్ కాల్ కోసం ప్రత్యేకమైన రింగ్ టోన్లను సెట్ చేసుకోవచ్చు. అనేక చాట్‌లకు ఒకేసారి సెట్టింగ్స్‌ను వర్తింపజేసే వెసులుబాటు కూడా ఉంటుంది.
ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. వివిధ దేశాల్లో ప్రయోగాత్మకంగా వేర్వేరు ధరలను పరిశీలిస్తున్నారు. యూరప్‌లో నెలకు 2.49 యూరోలుగా ఉండగా, మెక్సికోలో సుమారు 29 డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 2610 వరకు ఉండవచ్చని అంచనా. అయితే మన దేశంలో మార్కెట్‌ను బట్టి ధర మారే అవకాశం ఉంది. బిల్లింగ్ ప్రతి నెలా ఉంటుంది, వద్దనుకుంటే ఎప్పుడైనా రద్దు చేసుకునే ఆప్షన్ ఉంటుంది.
వారికి ముందుగానే..
ప్రస్తుతానికి ఈ వాట్సప్ ప్లస్ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది. టెస్టింగ్ పూర్తయ్యాక, యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో ఐఫోన్ యూజర్లకు కూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది. మొత్తానికి, వాట్సప్ తన రూపురేఖలను మార్చుకుంటూ యూజర్లకు మరింత ప్రీమియం అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.




