WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ఇలాంటి మెసేజ్‌ల‌తో జాగ్ర‌త్త‌.. క్లిక్ చేశారో అంతే సంగ‌తులు

WhatsApp Scam Alert: వాట్సాప్ వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా పెరుగుతున్నాయి.

Mokshith
Published on: 5 July 2026 1:20 PM IST
WhatsApp Scam Alert
X

WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ఇలాంటి మెసేజ్‌ల‌తో జాగ్ర‌త్త‌.. క్లిక్ చేశారో అంతే సంగ‌తులు

WhatsApp Scam Alert: వాట్సాప్ వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఉద్యోగాల పేరుతో, బహుమతులు గెలిచారంటూ, బ్యాంక్ అప్డేట్ లేదా పెట్టుబడుల పేరుతో నకిలీ మెసేజ్‌లు పంపి అమాయకులను మోసం చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి మోసాల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు.

తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దు

మీకు తెలియని నంబర్ నుంచి అకస్మాత్తుగా ఉద్యోగం, లక్కీ డ్రా, బహుమతి లేదా ప్రత్యేక ఆఫర్ గురించి మెసేజ్ వస్తే అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరగాళ్లు మొదట సాధారణంగా మాట్లాడి నమ్మకం కల్పిస్తారు. ఆ తర్వాత డబ్బు లేదా వ్యక్తిగత సమాచారం అడుగుతారు. అలాంటి నంబర్లకు స్పందించకుండా వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయడం మంచిది.

లింకులు, OTPల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

వాట్సాప్‌లో వచ్చే కొన్ని లింకులు అసలు బ్యాంక్ లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌ల మాదిరిగానే కనిపిస్తాయి. కానీ అవి నకిలీవి కావచ్చు. "KYC అప్డేట్ చేయండి", "మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది", "వెంటనే లాగిన్ అవ్వండి" వంటి సందేశాలు వస్తే తొందరపడకండి. ముందుగా ఆ లింక్ నిజమైనదేనా అని నిర్ధారించుకోవాలి. లాగే ఎవరైనా వాట్సాప్‌లో OTP అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు లేదా అధికారిక సంస్థలు ఎప్పుడూ వాట్సాప్ ద్వారా OTP అడగవు. అలాగే అపరిచితుల సూచనలతో మొబైల్ స్క్రీన్‌ను షేర్ చేయకూడదు. అలా చేస్తే మీ బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారం వారి చేతికి వెళ్లే ప్రమాదం ఉంది.

కుటుంబ సభ్యుల పేరుతో వచ్చే మెసేజ్‌ల పట్ల కూడా జాగ్రత్త

ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్త నంబర్లతో కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి కూడా మోసాలు చేస్తున్నారు. "నా ఫోన్ పోయింది", "ఇది నా కొత్త నంబర్", "అత్యవసరంగా డబ్బు పంపండి" అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. ఇలాంటి సందేశం వచ్చిన వెంటనే డబ్బు పంపకుండా, ఆ వ్యక్తి పాత నంబర్‌కు కాల్ చేసి నిజానిజాలు తెలుసుకోవాలి.

వాట్సాప్ సెక్యూరిటీ ఫీచర్లను తప్పకుండా ఉపయోగించండి

వాట్సాప్‌లో మీ భద్రత కోసం పలు ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవ‌సీ సెట్టింగ్స్‌లోకి మీ ప్రొఫైల్ ఫొటో, స్టేటస్, Last Seen వంటి వివరాలను కేవలం మీ కాంటాక్ట్‌లకే కనిపించేలా సెట్ చేసుకోవాలి. అలాగే Silence Unknown Callers ఫీచర్‌ను ఆన్ చేస్తే అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఆటోమేటిక్‌గా సైలెంట్ అవుతాయి. అదనంగా Two-Step Verificationను ప్రారంభిస్తే మీ వాట్సాప్ ఖాతాకు మరింత భద్రత లభిస్తుంది.

అనుమానాస్పద మెసేజ్‌లను వెంటనే రిపోర్ట్ చేయండి

మీకు నకిలీ లేదా అనుమానాస్పద మెసేజ్ వస్తే దాన్ని పట్టించుకోకుండా వదిలేయకుండా వెంటనే రిపోర్ట్ చేయాలి. అందుకోసం ఆ చాట్‌ను తెరిచి, కాంటాక్ట్ పేరుపై ట్యాప్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే Report, Block అనే ఆప్ష‌న్స్‌ కనిపిస్తాయి. వాటిని ఉపయోగించడం ద్వారా వాట్సాప్ ఆ ఖాతాపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర వినియోగదారులు కూడా అదే మోసానికి గురికాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.

సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మన తొందరపాటు, నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుంటారు. కాబట్టి వాట్సాప్‌లో వచ్చే ప్రతి మెసేజ్, లింక్ లేదా ఆఫర్‌ను ఒకసారి పరిశీలించి, నిజమో కాదో నిర్ధారించుకున్న తర్వాతే స్పందించడం మంచిది. చిన్న జాగ్రత్తే పెద్ద ఆర్థిక నష్టాన్ని నివారించగలదు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story