వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఫోన్‌లో సిమ్ లేకపోతే ఇబ్బందులే.. మారనున్న రూల్స్..?

WhatsApp: వాట్సాప్ (WhatsApp) వినియోగించే వారికి కీలక మార్పులు రానున్నాయి. 2027 జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో అకౌంట్‌కు లింక్ అయిన యాక్టివ్ సిమ్ అదే ఫోన్‌లో ఉండాల్సిన పరిస్థితి రావచ్చు.

Venkat
Published on: 27 Oct 2026 8:39 PM IST
WhatsApp
X

వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఫోన్‌లో సిమ్ లేకపోతే ఇబ్బందులే.. మారనున్న రూల్స్..?

WhatsApp New Rules: వాట్సాప్ యూజర్లకు కీలక పరిణామం ఎదురుకానుంది. 2027 జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్‌కు సంబంధించిన కొత్త నిబంధనల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఫోన్ నంబర్ ఆధారంగా పనిచేసే వాట్సాప్, టెలిగ్రామ్ (Telegram), సిగ్నల్ (Signal) వంటి మెసేజింగ్ యాప్స్ విషయంలో ఈ నిబంధనలు తీసుకొచ్చారు. ముఖ్యంగా అకౌంట్‌కు సంబంధించిన యాక్టివ్ సిమ్ అదే ఫోన్‌లో ఉండేలా చూడటం ఈ నిబంధనల ఉద్దేశం.

ప్రస్తుతం చాలామంది ఒక ఫోన్‌లో సిమ్ ఉంచి, అదే నంబర్‌తో మరో ఫోన్, టాబ్లెట్ లేదా ఇతర డివైస్‌లో వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. కొత్త నిబంధనల అమలుతో ఇలాంటి వినియోగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే జనవరి 1న ప్రతి ఒక్కరి వాట్సాప్ అకస్మాత్తుగా నిలిచిపోతుందని చెప్పలేం. నిబంధనలను యాప్ కంపెనీలు ఎలా అమలు చేస్తాయనే దానిపై అసలు ప్రభావం ఆధారపడి ఉంటుంది.

అసలు సిమ్ బైండింగ్ అంటే ఏమిటి?

టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) 2025 నవంబర్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్ (Snapchat), అరట్టై (Arattai), షేర్‌చాట్ (ShareChat), జోష్ (Josh), జియోచాట్ (JioChat) వంటి యాప్స్‌కు సిమ్ బైండింగ్‌కు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.

ఈ యాప్స్‌లో యూజర్ గుర్తింపునకు మొబైల్ నంబర్ కీలకంగా ఉంటుంది. అయితే కొంతమంది ఫోన్‌లో సంబంధిత సిమ్ లేకపోయినా అదే నంబర్‌తో మెసేజింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారు. దీన్ని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త నిబంధనల ప్రకారం అకౌంట్‌కు అనుసంధానమైన యాక్టివ్ సిమ్ సంబంధిత యాప్ నడుస్తున్న ఫోన్‌లోనే ఉండేలా కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కంపెనీలకు 2026 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. దీంతో 2027 జనవరి 1 నుంచి మార్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉంది.

కొత్త స్టడీలో ఏం తేలింది?

సిమ్ బైండింగ్‌పై ఎస్యా సెంటర్ (Esya Centre) నిర్వహించిన అధ్యయనంలో ప్రజలు, చిన్న వ్యాపారుల ఆందోళనలు వెలుగులోకి వచ్చాయి. 17 నగరాల్లో 353 మంది చిన్న వ్యాపారులు, 18 నగరాల్లో 2,033 మంది వినియోగదారులను ఈ సర్వేలో భాగం చేశారు. ఈ అధ్యయనం 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగింది.

సర్వేలో పాల్గొన్న చిన్న వ్యాపారుల్లో 87.2 శాతం మంది సిమ్ ఆధారిత మోసాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే 81 శాతం మంది సిమ్ బైండింగ్ వల్ల మెసేజింగ్ యాప్స్ భద్రత పెరుగుతుందని నమ్మలేదు.

వినియోగదారుల్లోనూ ఇదే తరహా అభిప్రాయం కనిపించింది. దాదాపు 59.2 శాతం మంది ఈ నిబంధనలతో మెసేజింగ్ యాప్స్ మరింత సురక్షితంగా మారతాయని భావించడం లేదని తెలిపారు.

ఫోన్‌లో సిమ్ లేకపోతే వాట్సాప్ ఆగిపోతుందా?

ఇది చాలామంది యూజర్లలో ఉన్న ప్రధాన సందేహం. ఉదాహరణకు ఒక ఫోన్‌లో వాట్సాప్ నంబర్‌కు సంబంధించిన సిమ్ ఉండగా, అదే అకౌంట్‌ను మరో ఫోన్‌లో సిమ్ లేకుండా ఉపయోగిస్తుంటే.. కొత్త నిబంధనల వల్ల ఆ వినియోగంపై ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

అలాగే పాత ఫోన్లు లేదా కేవలం వై-ఫైతో పనిచేసే టాబ్లెట్లలో మెసేజింగ్ యాప్స్ ఉపయోగించే వారికి కూడా మార్పులు ఎదురుకావచ్చు. అయితే లింక్డ్ డివైస్ ఫీచర్, ప్రతి యాప్ అమలు చేసే విధానం వేర్వేరుగా ఉండొచ్చు. అందువల్ల అన్ని డివైస్‌లలో ఒకే రకమైన మార్పు ఉంటుందని ఇప్పుడే చెప్పలేం.

విదేశాలకు వెళ్లేవారి పరిస్థితి?

విదేశాలకు వెళ్లే సమయంలో భారతీయ సిమ్ తీసేసి స్థానిక సిమ్ ఉపయోగించే వారికి కూడా ఈ నిబంధనలు ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ నంబర్‌తో వాట్సాప్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఫోన్ నుంచి ఆ సిమ్‌ను తొలగిస్తే యాప్ వినియోగంపై ప్రభావం పడొచ్చు.

ఇలాంటి సమయంలో భారతీయ సిమ్‌ను ఫోన్‌లో యాక్టివ్‌గా ఉంచుకోవడం ఒక మార్గం కావచ్చు. డ్యూయల్ సిమ్ లేదా eSIM సదుపాయం ఉన్న ఫోన్లు ఉపయోగించే వారికి కొంత సౌలభ్యం ఉండొచ్చు. అయితే ఇది ఫోన్, నెట్‌వర్క్, యాప్ అమలు చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది.

చిన్న వ్యాపారులకు ఎందుకు ఆందోళన?

చాలా చిన్న వ్యాపారాలు ప్రస్తుతం వాట్సాప్‌పైనే ఆధారపడి ఉన్నాయి. కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం, చెల్లింపుల వివరాలు పంపడం, డెలివరీ సమాచారం ఇవ్వడం వంటి పనులు వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి.

అంతేకాదు.. ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఫోన్‌తో పాటు కంప్యూటర్‌లోనూ ఉపయోగిస్తూ ఉద్యోగులు కస్టమర్లకు సమాధానాలు ఇస్తున్నారు. సిమ్ బైండింగ్ వల్ల ఏదైనా డివైస్‌లో లాగిన్ లేదా అకౌంట్ వినియోగంపై పరిమితులు వస్తే వ్యాపార కార్యకలాపాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది.

అందుకే కొత్త నిబంధనలపై సాధారణ యూజర్లతో పాటు చిన్న వ్యాపారుల్లోనూ ఆసక్తి, ఆందోళన రెండూ కనిపిస్తున్నాయి. అయితే 2027 జనవరి 1 నుంచి వాట్సాప్ అందరి ఫోన్లలో ఆగిపోతుంది అని మాత్రం ఇప్పుడే భావించాల్సిన అవసరం లేదు. అసలు అమలు విధానం, లింక్డ్ డివైస్‌లపై కంపెనీలు తీసుకునే నిర్ణయాలు స్పష్టమైన తర్వాతే పూర్తి ప్రభావం తెలుస్తుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.