WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై స్టిక్కర్లకు మన గొంతు కూడా జత చేయొచ్చు

WhatsApp: వాట్సాప్‌లో ఇకపై వీడియోలను శబ్దంతో కూడిన యానిమేటెడ్ స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు. సౌండ్ స్టిక్కర్లు ఫీచర్‌తో సొంత గొంతు, ఫోన్‌లోని ఆడియో, వీడియో అసలు శబ్దం లేదా అందుబాటులో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ జత చేయవచ్చు.

Venkat
Published on: 25 Nov 2026 8:16 PM IST
WhatsApp
X

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై స్టిక్కర్లకు మన గొంతు కూడా జత చేయొచ్చు

WhatsApp: వాట్సాప్‌లో చాటింగ్ చేసేటప్పుడు స్టిక్కర్లు పంపడం చాలామందికి అలవాటు. ఫన్నీగా స్పందించాలన్నా, మన భావాన్ని చెప్పాలన్నా స్టిక్కర్లు ఉపయోగపడుతున్నాయి. ఇప్పటివరకు కదిలే స్టిక్కర్లు మాత్రమే పంపే అవకాశం ఉండగా.. ఇప్పుడు వాటికి శబ్దాన్ని కూడా జత చేసే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. దీని పేరు సౌండ్ స్టిక్కర్లు. అంటే వీడియోను యానిమేటెడ్ స్టిక్కర్‌గా మార్చి, దానికి మన గొంతు లేదా నచ్చిన ఆడియోను జత చేసి పంపొచ్చు. దీంతో సాధారణ స్టిక్కర్ల కంటే మరింత సరదాగా చాటింగ్ చేసే అవకాశం కలగనుంది.

వీడియోతో స్టిక్కర్.. దానికి సౌండ్ కూడా

ఈ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. వాట్సాప్‌లో ఏదైనా వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్ ఓపెన్ చేయాలి. తర్వాత స్టిక్కర్ కీబోర్డ్‌లోకి వెళ్లి క్రియేట్ స్టిక్కర్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. ఫోన్ గ్యాలరీలో ఉన్న వీడియోను ఎంచుకుంటే వాట్సాప్ దాన్ని ఆటోమేటిక్‌గా యానిమేటెడ్ స్టిక్కర్‌గా మారుస్తుంది. అనంతరం ఎడిటర్ స్క్రీన్‌లో కనిపించే కొత్త ఆడియో బటన్‌ను నొక్కి, దానికి శబ్దాన్ని జత చేయవచ్చు. ఇలా తయారు చేసిన స్టిక్కర్‌ను చాట్‌లో పంపుకోవచ్చు.

మన గొంతు లేదా నచ్చిన ఆడియో జత చేసుకోవచ్చు

సౌండ్ స్టిక్కర్లులో ఆడియో ఎంపికలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. వీడియోలో ఉన్న అసలు శబ్దాన్నే కొనసాగించవచ్చు. లేదంటే వాట్సాప్ అందించే కొన్ని ముందుగా సిద్ధం చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ ఎంచుకోవచ్చు. ఫోన్‌లోని ఫైల్స్ యాప్ నుంచి ఆడియో ఫైల్‌ను తీసుకోవచ్చు. స్టిక్కర్ తయారు చేసే సమయంలోనే మన గొంతును రికార్డ్ చేసి జత చేసే సదుపాయం కూడా ఉంది. ఆడియోను స్టిక్కర్‌కు జత చేసే ముందు వినే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అంటే ఒక ఫన్నీ వీడియోకు మన గొంతుతో కామెంట్ జత చేసి స్నేహితులకు పంపొచ్చన్నమాట.

స్టిక్కర్‌లో శబ్దం ఎలా వినిపిస్తుంది?

సౌండ్‌తో కూడిన స్టిక్కర్‌ను ఎవరైనా పంపితే దానిపై చిన్న ఆడియో ఐకాన్ కనిపిస్తుంది. దీంతో ఆ స్టిక్కర్‌లో శబ్దం కూడా ఉందని అవతలి వ్యక్తికి తెలుస్తుంది. అయితే స్టిక్కర్ వచ్చిన వెంటనే ఆడియో ఆటోమేటిక్‌గా ప్లే కాదు. వాట్సాప్ డిఫాల్ట్‌గా దాన్ని మ్యూట్‌లో ఉంచుతుంది. వినాలనుకునే వారు ఆ సౌండ్ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. అప్పుడు ఆడియో మూడు సార్లు లూప్‌లో ప్లే అయి ఆగిపోతుంది. గ్రూప్ చాట్లలో వరుసగా స్టిక్కర్లు వచ్చినా ఒక్కసారిగా శబ్దాలు వినిపించకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. స్టిక్కర్‌తో పాటు దానికి జత చేసిన ఆడియోను కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షిస్తున్నట్లు WABetaInfo తెలిపింది.

ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్‌లోనూ పరీక్షలు

మొదట ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.41.3లో కనిపించింది. తాజాగా వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ 2.26.47.1 వాడుతున్న కొంతమంది బీటా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఐఫోన్ వినియోగదారుల కోసం వాట్సాప్ బీటా ఫర్ ఐఓఎస్ 26.46.10.70లోనూ ఈ ఫీచర్‌ను కొందరికి అందిస్తున్నట్లు WABetaInfo నవంబర్ 25న వెల్లడించింది. ఐఫోన్‌లో కొంతమంది బీటా టెస్టర్లతో పాటు యాప్ స్టోర్‌లోని కొందరు వినియోగదారులకూ ఇది కనిపిస్తోంది. అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ దశలవారీగా అందిస్తున్నారు. కాబట్టి తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసినంత మాత్రాన అందరికీ వెంటనే ఈ ఆప్షన్ కనిపించకపోవచ్చు. సాధారణ వినియోగదారులందరికీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని వాట్సాప్ ఇంకా ప్రకటించలేదు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.