WhatsApp Web: వాట్సాప్ వెబ్ ఓపెన్ చేస్తే.. ఫేస్‌బుక్ పేజీ రావడం ఏంటి బాసూ?

WhatsApp Web: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ వెబ్ సర్వీసెస్.

Naresh.k
Published on: 20 May 2026 6:58 AM IST
WhatsApp Web
X

WhatsApp Web: వాట్సాప్ వెబ్ ఓపెన్ చేస్తే.. ఫేస్‌బుక్ పేజీ రావడం ఏంటి బాసూ?

Facebook: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది రోజువారీ కార్యాలయ, వ్యక్తిగత పనుల కోసం వాట్సాప్ వెబ్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ సర్వీసులో ఊహించని మొరాయింపు కనిపించింది. బ్రౌజర్‌లలో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి, మొబైల్ యాప్ ద్వారా పాస్‌కీ స్కాన్ చేసిన నెటిజన్లకు మైండ్ బ్లాక్ అయ్యే సీన్ ఎదురైంది. స్క్రీన్‌పై వాట్సాప్ చాట్‌లు రావడానికి బదులు.. మెటా గ్రూప్‌నకే చెందిన ఫేస్‌బుక్ లాగిన్ పేజీ దర్శనమిచ్చింది. డేటా అంతరాయాలను ట్రాక్ చేసే ప్రముఖ ప్లాట్‌ఫారమ్ డౌన్ డిటెక్టర్ ప్రకారం.. ఈ సమస్యపై వందలాది మంది యూజర్లు ఫిర్యాదులు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా 48% మంది వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని, 21% మంది యాప్‌ సమస్యలను, 19% మంది అసలు లాగిన్ కాలేకపోతున్నామని నివేదించారు.

గ్లోబల్ వైడ్‌గా ఎఫెక్ట్..

ఈ సాంకేతిక లోపం కేవలం భారతదేశానికో లేదా ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. అమెరికా, మలేషియా, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో కూడా ఈ సమస్య తీవ్రంగా కనిపించింది. అమెరికాలోనే దాదాపు 200 మందికి పైగా డౌన్‌డిటెక్టర్‌లో మొబైల్, బ్రౌజర్ యాప్స్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఇక ఈ విచిత్ర పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు తీవ్ర నిరాశ, కోపం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఫన్నీ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు.

యూజర్ల రియాక్షన్స్ ఇవే..

వాట్సాప్ వెబ్‌ను యాక్సెస్ చేయడానికి మెటా నన్ను ఫేస్‌బుక్‌తో లాగిన్ అవ్వమని ఎందుకు అడుగుతుందో ఎవరైనా చెబుతారా? నాకు అసలు ఫేస్‌బుక్ అకౌంటే లేదు అని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి ఎవరూ వాట్సాప్ వెబ్ ద్వారా మీ ఫేస్‌బుక్ ఖాతాలోకి లాగిన్ అవ్వకండి. డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న నెట్‌వర్క్‌లను కాస్పర్‌స్కీ యాంటీవైరస్ గుర్తిస్తోంది, జాగ్రత్త అంటూ ఒక యూజర్ హెచ్చరించాడు. మార్క్ జుకర్‌బర్గ్ తన యాప్‌ల ద్వారా నాపై నిఘా పెట్టాలని చూస్తున్నాడు. అందుకే ఇలాంటి చెత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఉత్పత్తుల మధ్య సరైన విభజన లేకపోవడం అంటే వినియోగదారులను గౌరవించకపోవడమే అని ఒకరు మండిపడ్డారు.

మెటా సైలెంట్.. యూజర్లు వయొలెంట్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు సుమారుగా 300 నుండి 330 కోట్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులు ఉన్నారు. కేవలం అమెరికాలోనే 10 నుండి 12.4 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇంత భారీ నెట్‌వర్క్ ఉన్న యాప్‌లో ఇలాంటి విచిత్రమైన రీడైరెక్ట్ లోపం రావడం ఆందోళన కలిగించే విషయమే. అయితే, ఈ గ్లోబల్ అవుటేజ్ లేదా లాగిన్ గ్లిచ్‌పై వాట్సాప్ లేదా మెటా యాజమాన్యం అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దే పనిలో ఇంజనీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, వాట్సాప్ వెబ్‌లో ఫేస్‌బుక్ పేజీ రావడం మాత్రం ప్రస్తుతానికి టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకే దారితీసింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story