గూగుల్ హోమ్‌పేజీ ఎందుకు ఖాళీగా ఉంటుంది? రోజుకు రూ. 5000 కోట్ల ఆదాయాన్ని వదులుకోవడానికి కారణం ఇదే..!

Google Homepage Empty Reason: ఆ కాలంలో యాహూ, ఎం.ఎస్.ఎన్ వంటి దిగ్గజ సంస్థలు తమ హోమ్‌పేజీలను వార్తలు, ప్రకటనలు, షాపింగ్ లింకులతో నింపేసేవి. కానీ గూగుల్ హోమ్‌పేజీ పరిమాణం తక్కువ ఉండడంతో కనురెప్ప మూసి తెరిచేలోపు ఓపెన్ అయ్యేది.

Venkat
Published on: 8 May 2026 6:00 AM IST
why google homepage is empty business strategy telugu news
X

గూగుల్ హోమ్‌పేజీ ఎందుకు ఖాళీగా ఉంటుంది? రోజుకు రూ. 5000 కోట్ల ఆదాయాన్ని వదులుకోవడానికి కారణం ఇదే..!

Google Homepage Empty Reason: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకటనల సంస్థ అయిన గూగుల్, తన హోమ్‌పేజీని మాత్రం ఖాళీగా ఉంచుతుంది. బిలియన్ల కొద్దీ ప్రజలు సందర్శించే ఈ పేజీలో ప్రకటనలు ప్రదర్శిస్తే రోజుకు వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. అయినప్పటికీ, గూగుల్ ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర, వ్యాపార వ్యూహం, వినియోగదారుల నమ్మకం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

1998లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ గూగుల్‌ను రూపొందించినప్పుడు, హోమ్‌పేజీని ఖాళీగా ఉంచడం వెనుక ఎటువంటి పెద్ద వ్యాపార వ్యూహం లేదు. అప్పట్లో వారికి హెచ్.టి.ఎమ్.ఎల్ (HTML) కోడింగ్ సరిగ్గా తెలియకపోవడమే అసలు కారణం. కేవలం ఒక సెర్చ్ బాక్స్ (Search Box) మాత్రమే వారు రూపొందించగలిగారు. అయితే, కాలక్రమేణా ప్రజలు ఈ రూపాన్నే అమితంగా ఇష్టపడటంతో, అదే గూగుల్ బ్రాండ్ ముద్రగా మారిపోయింది.

వేగమే గూగుల్ బలం..

ఆ కాలంలో యాహూ, ఎం.ఎస్.ఎన్ వంటి దిగ్గజ సంస్థలు తమ హోమ్‌పేజీలను వార్తలు, ప్రకటనలు, షాపింగ్ లింకులతో నింపేసేవి. దీనివల్ల ఆ పేజీలు లోడ్ కావడానికి 5 నుంచి 8 సెకన్ల సమయం పట్టేది. కానీ గూగుల్ హోమ్‌పేజీ పరిమాణం కేవలం 14 కేబీ (KB) మాత్రమే ఉండటంతో, కనురెప్ప మూసి తెరిచేలోపు అంటే ఒక్క సెకను కంటే తక్కువ సమయంలోనే ఓపెన్ అయ్యేది. నేటి 5జీ యుగంలో కూడా ఈ వేగం గూగుల్ పట్ల వినియోగదారులకు ఉన్న నమ్మకాన్ని నిలబెడుతోంది.

వినియోగదారుల నమ్మకం, బ్రాండ్ విలువ..

1990వ దశకం చివరలో ఇంటర్నెట్ వినియోగదారులు అనవసరపు ప్రకటనలు, పాప్-అప్‌లతో విసిగిపోయి ఉండేవారు. గూగుల్ తన స్వచ్ఛమైన పేజీ ద్వారా తాము కేవలం సమాచారాన్ని అందించే "సెర్చ్ ఇంజిన్" మాత్రమేనని, వినోద పోర్టల్ కాదని స్పష్టం చేసింది. అనవసర ప్రకటనలతో ఇబ్బంది పెట్టకపోవడం వల్ల ప్రజలకు గూగుల్ పై అచంచలమైన విశ్వాసం కలిగింది. అందుకే నేడు ఇంటర్నెట్‌లో ఏదైనా వెతకడాన్ని "గూగుల్ చేయండి" అని పిలిచే స్థాయికి ఆ సంస్థ ఎదిగింది.

అసలైన ఆదాయం ఎక్కడ?

గూగుల్ తెలివైన వ్యూహం ఏంటంటే, అసలైన డబ్బు హోమ్‌పేజీలో కాకుండా శోధన ఫలితాల్లో (Search Results) ఉందని గుర్తించడం. హోమ్‌పేజీకి వచ్చే ప్రతి ఒక్కరూ వస్తువులను కొనడానికి రారు. కానీ ఎవరైనా "ఉత్తమ స్మార్ట్‌ఫోన్" అని వెతికినప్పుడు, వారు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయాల్లో ప్రకటనలు చూపించడం వల్ల గూగుల్‌కు అత్యధిక లాభాలు వస్తాయి. హోమ్‌పేజీని ఖాళీగా ఉంచి బ్రాండ్ విలువను పెంచుకుంటూ, సెర్చ్ రిజల్ట్స్ ద్వారా గూగుల్ లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.

ఒకవేళ ప్రకటనలు ఉంటే?

గూగుల్‌కు రోజుకు సుమారు 850 కోట్ల విజిట్స్ ఉంటాయి. హోమ్‌పేజీలో ప్రకటనలు ఉంటే రోజుకు రూ. 5,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రకటనలతో పేజీ నిండిపోతే వినియోగదారులు ఇతర సెర్చ్ ఇంజిన్ల వైపు వెళ్లే ప్రమాదం ఉందని గూగుల్ భావిస్తుంది. 2024లో గూగుల్ వార్షిక ఆదాయం సుమారు రూ. 19.67 లక్షల కోట్లుగా ఉంది. వినియోగదారుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే గూగుల్ విజయ రహస్యం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story