UPI: తప్పుడు నంబర్‌కు డబ్బు వెళ్తే తిరిగి రావాలంటే ఏం చేయాలి?
UPI: తప్పుడు UPI నంబర్‌కు డబ్బు పంపితే తిరిగి రాబట్టుకోవడానికి మొదటి గంట కీలకమని నిపుణులు చెబుతున్నారు.
UPI: తప్పుడు నంబర్‌కు డబ్బు వెళ్తే తిరిగి రావాలంటే ఏం చేయాలి?
UPI: తప్పుడు UPI నంబర్/ఐడీకి డబ్బు పంపితే తిరిగి రాబట్టుకోవడానికి మొదటి గంట చాలా కీలకమని సింక్ట్రిక్ టెక్నాలజీ సీఈవో అకిబ్ తెలిపారు. 'ట్రాన్సాక్షన్ ఐడీతో యూపీఐ యాప్‌లో వెంటనే కంప్లైంట్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకుకు కాల్ చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఫిర్యాదు చేసినంత మాత్రాన ఆటోమేటిక్‌గా డబ్బులు తిరిగి మీ ఖాతాలో జమకావు. కచ్చితంగా డబ్బులు పొందిన వ్యక్తి ఆమోదం ఉండాల్సిందే' అని వివరించారు.
UPI లావాదేవీ విజయవంతమై, తప్పు వ్యక్తికి వెళ్తే ఆటోమేటిక్ రీఫండ్ ఉండదు. డబ్బు నిజమైన ఖాతాలోకి చేరుతుంది కాబట్టి, గ్రహీత ఒప్పుకుంటేనే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పేమెంట్ ఫెయిలై, డబ్బు ఖాతా నుంచి కట్ అయి ఎవరికీ చేరకపోతే సాధారణంగా కొన్ని రోజుల్లో ఆటోమేటిక్‌గా రివర్స్ అవుతుంది. ఈ రెండింటి మధ్య తేడా గుర్తించాలి.
ముందుగా యాప్‌లో లావాదేవీని ఎంచుకుని, హెల్ప్ లేదా సపోర్ట్ విభాగంలో తప్పు వ్యక్తికి పంపినట్లు ఫిర్యాదు చేయాలి. ట్రాన్సాక్షన్ ఐడీ లేదా UTR నంబర్, తేదీ, సమయం, మొత్తం, గ్రహీత UPI ఐడీ, స్క్రీన్‌షాట్, ఫిర్యాదు రిఫరెన్స్ నంబర్ తప్పనిసరిగా వద్ద ఉంచుకోవాలి. తర్వాత బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, గ్రహీత బ్యాంకుకు రికవరీ అభ్యర్థన పంపమని కోరాలి. వీలైతే డబ్బు అందుకున్న వ్యక్తిని సంప్రదించి, లావాదేవీ వివరాలు చూపిస్తూ తిరిగి పంపమని అడగవచ్చు.
యాప్, బ్యాంక్ స్థాయిలో పరిష్కారం కాకపోతే NPCI వెబ్‌సైట్‌లో UPI డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ద్వారా "Incorrectly transferred to another account" ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1740కు కూడా కాల్ చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లో స్పందన రాకపోతే, లేదా వచ్చిన స్పందనతో సంతృప్తి లేకపోతే ఆర్‌బీఐ ఓంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కొందరు కావాలని డబ్బు తిరిగి ఇవ్వకపోతే పోలీసులను, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌ను ఆశ్రయించవచ్చు. బ్యాంకులు, NPCI రీఫండ్ కోసం UPI పిన్, OTP అడుగుతూ ఎప్పుడూ కాల్ చేయవు. అలాంటి కాల్స్ మోసమని గుర్తించాలి.




