Xiaomi 18 Global : షామీ 18 గ్లోబల్ వేరియంట్ లీక్.. ప్రపంచ మార్కెట్లోకి త్వరలోనే ఎంట్రీ

ప్రముఖ టెక్ దిగ్గజం షామీ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ 'షామీ 18' ను ముందుగా చైనా మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా..

G Krishna
Published on: 11 Sept 2026 12:21 PM IST
Xiaomi 18 Global Variant Leak
X

Xiaomi 18 Global Variant Leak 

ప్రముఖ టెక్ దిగ్గజం షామీ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ 'షామీ 18' ను ముందుగా చైనా మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా ప్రతిసారి చైనాలో లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత మాత్రమే గ్లోబల్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటారు. అయితే ఈసారి అంతకంటే ముందే అంతర్జాతీయ మార్కెట్లోకి ఈ సిరీస్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దీని గ్లోబల్ వేరియంట్ తైవాన్ ఎన్‌సీసీ సెర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించడంతో ఫోన్‌కు సంబంధించిన కీలక విశేషాలు బయటకు వచ్చాయి.

ఎన్‌సీసీ సెర్టిఫికేషన్ లీకులు

తైవాన్ ఎన్‌సీసీ డేటాబేస్‌లో '2611FPNFAG' మోడల్ నంబరుతో ఒక నయా షామీ స్మార్ట్‌ఫోన్ లీస్ట్ అయింది. ఇది షామీ 18 గ్లోబల్ వేరియంట్ అని టెక్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సెర్టిఫికేషన్ ద్వారా ఫోన్ రెండు ప్రధాన స్టోరేజ్ వేరియంట్లలో రాబోతున్నట్లు తేలింది. ఇందులో 256GB మోడల్‌లో దాదాపు 198GB వరకు, 512GB మోడల్‌లో దాదాపు 469GB వరకు వాడుకకు అనుకూలమైన యూజబుల్ స్టోరేజ్ లభిస్తుంది.

IP68 ప్రొటెక్షన్ , ఫాస్ట్ ఛార్జింగ్

ఫోన్ భద్రత , ఛార్జింగ్ విభాగానికి సంబంధించి కూడా కీలక విషయాలు వెల్లడయ్యాయి. నీరు, ధూళి నుంచి రక్షణ కల్పించేలా ఈ హ్యాండ్‌సెట్‌కు ఐపీ68 (IP68) రేటింగ్‌ను అందించారు. దీనితో పాటు 'MDY-19-EX' మోడల్ నంబర్ కలిగిన ఛార్జర్‌ను ఈ ఫోన్ కోసం పరీక్షించారు. టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ వివరాల ప్రకారం ఈ ఫోన్ ఏకంగా 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సాంకేతికతకు సపోర్ట్ ఇస్తుందని తేలింది.

ముందే రానున్న గ్లోబల్ వేరియంట్

గత ఏడాది షామీ 17 చైనాలో సెప్టెంబర్ 2025లో విడుదల కాగా, దాని గ్లోబల్ వేరియంట్ అక్టోబర్ చివరి నాటికి ఎన్‌సీసీ డేటాబేస్‌లో లీస్ట్ అయి, ఫిబ్రవరి 2026లో మార్కెట్లోకి వచ్చింది. కానీ ఈసారి షామీ 18 మోడల్ సెప్టెంబర్‌లోనే ఎన్‌సీసీ జాబితాలో ప్రత్యక్షమవ్వడం విశేషం. దీనిని బట్టి చూస్తే భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ ఫోన్ అనుకున్న సమయం కంటే చాలా వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

డిజైన్ , బ్యాటరీ కెపాసిటీ

ఇప్పటివరకు వెలువడిన లీకుల ఆధారంగా షామీ 18 ఫోన్ కాంపాక్ట్ డిజైన్‌తో రానుంది. ఇందులో 6.4 అంగుళాల 2K డిస్‌ప్లేను అమర్చినట్లు సమాచారం. వెనుక వైపు చతురస్రాకారంలో ఉన్న కెమెరా మోడ్యూల్ సెటప్ ఆకట్టుకుంటుంది. మునుపటి షామీ 17 మోడల్‌లోని 7,000mAh బ్యాటరీతో పోలిస్తే, ఈ కొత్త షామీ 18 మోడల్‌లో ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.