ఫోన్‌ను గిటార్‌గా మార్చేసిన Xiaomi.. ఈ గ్యాడ్జెట్ ఏంటంటే.?
Xiaomi Pocket Guitar : స్మార్ట్ఫోన్లతో కొత్త కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు టెక్ కంపెనీలు వినూత్న యాక్సెసరీలను తీసుకొస్తున్నాయి.
Xiaomi Pocket Guitar
Xiaomi Pocket Guitar : స్మార్ట్ఫోన్లతో కొత్త కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు టెక్ కంపెనీలు వినూత్న యాక్సెసరీలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో షియోమీ మరో ఆసక్తికరమైన గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్తగా లాంచ్ చేసిన షియోమీ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్ల కోసం కంపెనీ షియోమీ ప్యాకెట్ గిటార్ (Xiaomi Pocket Guitar) పేరుతో ప్రత్యేకమైన యాక్సెసరీని తీసుకొచ్చింది. ఫోన్ వెనుక భాగంలో ఉన్న సెకండరీ డిస్ప్లేను ఉపయోగించుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించడం విశేషం.
ఫోన్‌కే మాగ్నెట్‌తో అటాచ్
షియోమీ ప్యాకెట్ గిటార్‌ను బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. ఇందులో ఉన్న బలమైన మాగ్నెట్ సాయంతో దీన్ని ఫోన్ వెనుక భాగానికి సులభంగా అమర్చుకోవచ్చు. ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు యాక్సెసరీ నేరుగా వెనుక సెకండరీ డిస్ప్లే ప్రాంతంలోకి వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే మధ్యలో ఉన్న హింజ్ చుట్టూ రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకవైపు I నుంచి VII వరకు నంబర్లతో కూడిన కార్డ్ బటన్లు ఉంటాయి. మరోవైపు గిటార్ స్ట్రింగ్స్లా పనిచేసే రిడ్జ్లతో టెక్స్చర్డ్ ప్యానెల్ ఉంటుంది. అంతేకాదు, అవసరమైనప్పుడు దీన్ని మరోవైపు మడిచి చిన్న ఫోన్ స్టాండ్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.
బ్లూటూత్‌తో ఫోన్‌కు కనెక్షన్
ఈ ప్యాకెట్ గిటార్‌ను చైనాకు చెందిన చాంగ్బా కరోకే, సింగింగ్ యాప్‌తో ఉపయోగించవచ్చు. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసిన తర్వాత యాప్‌లోని ప్రత్యేక పెర్ఫార్మెన్స్ విభాగంలోకి వెళ్లి రెండు మోడ్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. చోర్డ్ మోడ్‌లో ఎడమ చేతితో I నుంచి VII వరకు ఉన్న కార్డ్ బటన్లను ప్రెస్ చేస్తూ, కుడి చేతితో టెక్స్చర్డ్ ప్యానెల్‌పై స్ట్రమ్ చేయాలి. ఇక రిథమ్ మోడ్‌లో కార్డులను ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు. సరైన రిథమ్‌లో స్ట్రమ్ చేస్తే మిగతా పనిని యాప్ ఆటోమేటిక్‌గా చూసుకుంటుంది.
వెనుక డిస్ప్లేనే స్పెషల్
షియోమీ ప్యాకెట్ గిటార్లో ఫోన్ వెనుక ఉన్న సెకండరీ డిస్ప్లే కీలకంగా పనిచేస్తుంది. స్ట్రమ్మింగ్ చేసే భాగం డిస్ప్లేకు కింద ఉండేలా యాక్సెసరీని డిజైన్ చేశారు. దీంతో గిటార్ ప్లే చేస్తున్న సమయంలో చేతులు స్క్రీన్‌ను పూర్తిగా కవర్ చేయవు. దీని వల్ల చేతులను పక్కకు జరపకుండానే వెనుక డిస్ప్లేపై కనిపించే కంట్రోల్స్, ఇతర సమాచారాన్ని చూసుకోవచ్చు. అయితే ఈ రియర్ డిస్ప్లే ఆధారిత పెర్ఫార్మెన్స్, రికార్డింగ్ ఫీచర్లు షియోమీ 18 ప్రో సిరీస్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఇతర ఫోన్లలోనూ పనిచేస్తుంది
షియోమీ 18 ప్రో సిరీస్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నప్పటికీ, ప్యాకెట్ గిటార్‌ను ఇతర షియోమీ ఫోన్లు, iOS 14 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో పనిచేసే ఐఫోన్లకు కూడా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. అయితే ఆయా ఫోన్లలో వెనుక డిస్ప్లే ఆధారిత పెర్ఫార్మెన్స్, రికార్డింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండవు. ప్లే చేయడం, పాటలను బ్రౌజ్ చేయడం, ట్యూనింగ్ వంటి పనుల కోసం ఫోన్ ముందు డిస్ప్లేనే ఉపయోగించాల్సి ఉంటుంది.
బ్యాటరీ 30 రోజుల వరకు.. ధర ఎంతంటే?
ఈ యాక్సెసరీలో 630mAh బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 30 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని షియోమీ చెబుతోంది. ఛార్జింగ్ కోసం USB టైప్-సీ పోర్ట్‌ను అందించగా, ఫోన్‌తో వైర్‌లెస్‌గా కనెక్ట్ అయ్యేందుకు బ్లూటూత్ కనెక్టివిటీని ఉపయోగించారు.
చైనాలో షియోమీ ప్యాకెట్ గిటార్ ధరను 599 యువాన్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.7,500 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ యాక్సెసరీని చైనాలో JD.com ద్వారా విక్రయించనున్నారు. భారత మార్కెట్లో దీని లభ్యత, ధరపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.




