YouTube Monetization Rules : యూట్యూబ్ క్రియేటర్లకు బిగ్ షాక్.. మానిటైజేషన్ కోసం కొత్త రూల్స్ ఇవే.!
YouTube Monetization Rules : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తన "యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్" (YPP) మానిటైజేషన్ నిబంధనలలో కీలక మార్పులను..
YouTube monetization
YouTube Monetization Rules : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తన "యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్" (YPP) మానిటైజేషన్ నిబంధనలలో కీలక మార్పులను ప్రకటించింది. ప్రకటనలు (Ads), యూట్యూబ్ ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయంలో వాటా పొందాలనుకునే కొత్త క్రియేటర్లకు ఈ నూతన నిబంధనలు వర్తిస్తాయి. 2018 తర్వాత యూట్యూబ్ తన YPP అర్హతల్లో ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్లాట్‌ఫామ్‌లో నిరంతరం నాణ్యమైన కంటెంట్‌ను అందిస్తూ క్రియాశీలంగా ఉండే క్రియేటర్లకు సరైన గుర్తింపు, ఎక్కువ ఆదాయం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
కొత్త క్రియేటర్లకు మారిన అర్హత నిబంధనలు
ఫిబ్రవరి 1, 2027 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం.. యాడ్స్, ప్రీమియం ఆదాయ వాటా కోసం అప్లై చేసుకునే కొత్త క్రియేటర్లు తమ ఛానెల్‌లో కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండాలి. దీంతో పాటు లాంగ్-ఫార్మ్ వీడియోల ద్వారా గడిచిన 365 రోజులలో 8,000 గంటల వాచ్ టైమ్ సాధించాల్సి ఉంటుంది. గతంలో ఇది 4,000 గంటలుగా ఉండేది. ఒకవేళ షార్ట్స్ వీడియోల ద్వారా అయితే గడిచిన 90 రోజులలో 20 మిలియన్ల (2 కోట్లు) వ్యూస్ పొంది ఉండాలి. గతంలో ఈ పరిమితి 10 మిలియన్లుగా ఉండేది. అయితే, యూట్యూబ్‌లో ఉన్న ఫ్యాన్ ఫండింగ్ (సూపర్ చాట్స్, మెంబర్‌షిప్‌లు), యూట్యూబ్ షాపింగ్ ప్రాడక్ట్‌ల ద్వారా ఆదాయం పొందే ప్రాథమిక అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. అలాగే ఇప్పటికే YPPలో భాగమైన క్రియేటర్లకు ఈ కొత్త ఎంట్రీ రూల్స్ వల్ల ఎటువంటి ముప్పు ఉండదు.
షార్ట్స్ ఆదాయంపై ప్రత్యేక శ్రద్ధ , ప్రోత్సాహకాలు
ఇప్పటికే యూట్యూబ్ పార్ట్‌నర్‌గా ఉన్న క్రియేటర్లకు షార్ట్స్ (Shorts) ప్రకటనల ఆదాయం అందాలంటే ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఫిబ్రవరి 1, 2027 నుంచి ఉన్న క్రియేటర్లు తమ షార్ట్స్ వీడియోల ద్వారా ప్రకటనల వాటా పొందడానికి గడిచిన 90 రోజులలో కనీసం 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ కలిగి ఉండాలి. ఒకవేళ ఛానెల్ ఈ 10 మిలియన్ల మైలురాయి కంటే కిందకు పడిపోయినా, వారు YPP నుంచి తొలగించబడరు. వారి పెద్ద వీడియోల ద్వారా వచ్చే ఆదాయం యథావిధిగా వస్తూనే ఉంటుంది. తిరిగి ఎప్పుడైతే ఛానెల్ 10 మిలియన్ల వ్యూస్ దాటుతుందో, అప్పుడు షార్ట్స్ ఆదాయం స్వయంచాలకంగా పునఃప్రారంభమవుతుంది. దీంతో పాటు క్రియేటర్ల కోసం యూట్యూబ్ షాపింగ్ బోనస్‌లు, బ్రాండ్ డీల్స్ , ట్రెండింగ్ ఆధారిత ప్రోత్సాహకాల పేరుతో కొత్త ఇన్‌సెంటివ్ ప్రోగ్రామ్‌లను కూడా పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది.
మరింత విస్తరించనున్న 'ప్రీమియం లైట్' సభ్యత్వం
యూట్యూబ్ తన 'ప్రీమియం లైట్' (Premium Lite) ప్లాన్‌ను యూట్యూబ్ ప్రీమియం అందుబాటులో ఉన్న అన్ని దేశాలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. భారతదేశంలో ఇది నెలకు రూ.89లకే అందుబాటులో ఉండి, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు , స్మార్ట్ టీవీలలో దాదాపు అన్ని వీడియోలను ప్రకటనలు లేకుండా, బ్యాక్‌గ్రౌండ్ ప్లే , డౌన్‌లోడ్ ఆప్షన్‌లతో వీక్షించే వెసులుబాటును కల్పిస్తుంది. ఈ ప్రీమియం , ప్రీమియం లైట్ చందాల నుంచి వచ్చే ఆదాయంలో యూట్యూబ్ క్రియేటర్లకు తగిన వాటాను అందిస్తుంది. సాధారణ లాంగ్-ఫార్మ్ వీడియోలకు 55 శాతం, షార్ట్స్ వీడియోలకు 45 శాతం ఆదాయ వాటాను క్రియేటర్లకు కేటాయిస్తున్నారు. గ్లోబల్‌గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయాలు క్రియేటర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.




