12 Years of Telangana: బండి కట్టి...గజ్జెకట్టి...తెలంగాణ పోరాటానికి జైకొట్టి - ఆవిర్భావంపై ప్రత్యేక కథనం

ఉద్యమం, త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం కోరుకున్న విధంగా అభివృద్ధి సాధించిందా? తొలి, మలిదశ ఉద్యమాల స్పూర్తి ప్రజల్లో ఫలితాలను ఇచ్చిందా... 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటి తెలుసుకుందాం.

Balachander
Published on: 2 Jun 2026 8:34 AM IST
12 Years of Telangana: బండి కట్టి...గజ్జెకట్టి...తెలంగాణ పోరాటానికి జైకొట్టి - ఆవిర్భావంపై ప్రత్యేక కథనం
X

12 Years of Telangana: తెలంగాణ.. అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. దశాబ్దాల అణచివేతపై తిరగబడిన ఒక పల్లెపదం. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా "బండెనక బండి కట్టి..." అంటూ సాగిన సాయుధ పోరాటం నుండి, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అనే నినాదంతో మలిదశ ఉద్యమం వరకు ఈ గడ్డ చూపిన చైతన్యం అద్వితీయం. వందలాది మంది విద్యార్థుల బలిదానాలు, సుదీర్ఘ రాజకీయ వ్యూహాల అనంతరం 2014 జూన్ 2న భారతదేశ పటంలో నూతన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి పుష్కరకాలం పూర్తయింది. భావోద్వేగ ఉద్యమం నుంచి ఉద్భవించిన ఈ 12 ఏళ్ల స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏం సాధించింది? సామాన్యుడి ఆశలు ఎంతవరకు నెరవేరాయి? రాజకీయ, సామాజిక ముఖచిత్రంలో ఏమైన మార్పులు వచ్చాయా? తెలుసుకుందాం.

విలీనం నుండి విభజన దాకా

1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేశారు. విలీనం చేసే సమయంలో తెలంగాణ ప్రాంతానికి స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ... కాలక్రమేణా వనరుల పంపిణీ, ఉద్యోగాలు, విద్యావకాశాల్లో జరిగిన తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రజల్లో అసంతృప్తిని రగిల్చింది. 1956లో నూతన రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత 1969లో తొలిదశ ఉద్యమం మొదలైంది. వందలాదిమంది విద్యార్థులు ప్రాణాలర్పించినా నాటి రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాలేదు. ఉద్యమం విజయవంతం కాలేకపోయినా... ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆకాంక్ష ప్రజల గుండెల్లో ఆవిధంగానే నిలిచిపోయింది. ఎప్పటికైనా సరే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఆశయంతోనే ప్రజలు జీవించారు.

ఆ స్పూర్తితోనే 2001లో మలిదశ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. కేసీఆర్‌ నాయత్వంలో టీఆర్ఎస్‌ పార్టీ ఆవిర్భవించి, ఉద్యమానికి సరికొత్తగా ఊపిరిని అందించారు. ఈ ఉద్యమం కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా విద్యార్థి, ప్రజా ఉద్యమంగా మలిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా విద్యార్థులు, మేధావులు, జానపద కళాకారులు పల్లెపల్లెను చైతన్యపరిచారు. మిలియన్‌ మార్చ్‌, సకల జనుల సమ్మె వంటి అపూర్వమైన సంఘటన తరువాత 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్‌ ఆమోదంతో ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భవానికి పునాదులు పడ్డాయి. ఆ తరువాత 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది.

ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి

రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఆర్థిక మనుగడపై ఎన్నో అపోహలు ఉన్నమాట వాస్తవం. కానీ, గడిచిన 12 ఏళ్ల కాలంలో తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థలోనే సరికొత్త పవర్‌హౌస్‌గా అవతరించింది. 2014-15లో తెలంగాణ సగటు పౌరుడి తలసరి ఆదాయం కేవలం రూ.1,24,104గా ఉండగా... 2025-26 నాటికి దేశంలోనే రికార్డు స్థాయిలో రూ. 4,18,931కి చేరింది. ఇది జాతీయ సగటుకంటే రెండింతలు ఎక్కువ కావడం విశేషం. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి సుమారు 17.82 లక్షల కోట్ల మార్కును దాటి స్థిరమైన వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నది. తెలంగాణ ఆదాయంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్న పరిశ్రమలు, ఐటీ హబ్‌లు జెట్‌ వేగంతో పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరుకుంది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తమ రెండో కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పవడం విశేషం. ఇక దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్మా రంగానికి హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఏరోస్పేస్‌ రంగాలు ఊహించినదానికంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి.

జలవిప్లవం .... పచ్చబడ్డ పల్లెలు

తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది రైతులే. మన నీళ్లు మనకే అనే నినాదాన్ని బలంగా చెప్పడంలో రైతులు విజయం సాధించారు. ఈ ఉద్యమం తరువాత రూపుదిద్దుకున్నదే కాళేశ్వరం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం పేరొందింది. ఇక పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ ద్వారా వేలాది గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణతో పల్లెల్లో జలకళను నింపాయి. దీంతో భూగర్భ జలమట్టం పెరిగింది. ఉచిత విద్యుత్‌, పెట్టుబడి సాయం వంటి పథకాలు కారణంగా తెలంగాణ భూమి ధాన్యాగారంగా మారింది. దేశంలో ధాన్యం పండించే పంజాబ్‌తో సమానంగా పోటీ పడుతోంది.

సామాన్యుడి ఆవేదనలు, సవాళ్లు

అభివృద్ధి, సంక్షేమం నాణేనికి ఒకవైపు అయితే.. మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్యుడి ఆశలు, నిరుద్యోగుల ఆవేదనలు ఇప్పటికీ సవాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నడిచింది నియామకాల కోసమే. అయితే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాల భర్తీ జరిగినప్పటికీ, పేపర్ లీకేజీలు, కోర్టు కేసులు యువతను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా జరగాలనే డిమాండ్ నేటికీ బలంగా వినిపిస్తోంది. ఉచితాలు, భారీ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన అప్పులు ప్రస్తుతం రాష్ట్ర జీఎస్‌డీపీలో దాదాపు 29% శాతానికి చేరాయి. ఈ అప్పుల భారం భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందన్నది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధితో పాటు అప్పులను కూడా బ్యాలెన్స్‌ చేయాలని, ఆ విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెబుతున్నారు. దశాబ్ద కాలం పాటు ఉద్యమ పార్టీగా పాలించిన బీఆర్ఎస్ స్థానంలో, ప్రజాస్వామ్య మార్పును కోరుకుంటూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. రాజకీయ అధికారాలు మారినా, పౌర హక్కుల పరిరక్షణ, అవినీతి రహిత పాలనను ప్రజలు ఆశిస్తున్నారు. ఈ మార్పు ప్రజలకు ఏ మేరకు లాభించింది అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

మొత్తంగా చూసుకుంటే... 12 ఏళ్ల ప్రయాణంలో తెలంగాణ మౌలిక వసతులు, ఐటీ, వ్యవసాయ రంగాల్లో సాధించిన పురోగతి అసాధారణమైనది. అయితే, ఈ సంపద కేవలం మహానగరాలకో లేదా నిర్దిష్ట వర్గాలకో పరిమితం కాకుండా, సమాజంలో చిట్టచివరి వరుసలో ఉన్న పేదవాడికి చేరినప్పుడే, అమరవీరుల త్యాగాలకు సంపూర్ణ న్యాయం చేకూరినట్లవుతుంది. పేదోడు పేదోడిగానే ఉండిపోకుండా కనీసం బతికేందుకు ఆసరా చూపిస్తే చాలు. ఎవరి అవసరం లేకుండా బతికేస్తాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story