Ganesh immersion: వినాయక నిమజ్జన వేళ విషాదం.. ఆరుగుర విద్యార్థులు దుర్మరణం!
Ganesh immersion: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంచెర్ల నేరేడుచెరువులో వినాయక నిమజ్జనం సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది.
Ganesh immersion: వినాయక నిమజ్జన వేళ విషాదం.. ఆరుగుర విద్యార్థులు దుర్మరణం!
Tragedy in Sangareddy: అందరిలాగే పూజలు చేసి.. ఆనందంగా వినాయకుడిని సాగనంపాలని వెళ్లారు. కానీ, ఆ దేవుడే వారిని శాశ్వతంగా తన దగ్గరికి తీసుకెళ్తాడని ఎవరూ ఊహించలేదు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంచెర్ల గ్రామంలో జరిగిన ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వినాయక నిమజ్జనం కోసం సరదాగా చెరువులోకి దిగిన ఆరుగురు నిరుపేద విద్యార్థులు ఈత రాక, మట్టి గుంతల ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది.
పెద్దకంచెర్ల గ్రామంలోని నేరేడుచెరువులో వినాయక నిమజ్జన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. అయితే, చెరువులో మట్టి కోసం తీసిన ప్రమాదకరమైన గుంతలను గమనించకుండా విద్యార్థులు విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు నీటిలోకి దిగారు. విగ్రహం బరువుకు తోడు, అడుగుల లోతు తెలియక ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులను నర్సింహ రాజు, సుమంత్, గణేష్, ఉదయ్ కిరణ్, తేజ, సిద్ధార్థ్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా శివనగర్ చౌరస్తా సమీపంలోని శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులు కావడం మరింత కంటతడి పెట్టిస్తోంది.
ఈ ట్రస్ట్‌లో సుమారు 70 మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పాలిటెక్నిక్, బీటెక్ వరకు చదువుకుంటూ ప్రయోజకులు కావాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులను మాత్రమే చేర్చుకుని ఆదరిస్తున్న ఆ ట్రస్ట్, ఇప్పుడు ఆ ఆరుగురు విద్యార్థుల మృతితో రోదనల సంద్రంగా మారింది. అమ్మానాన్నల ఆదరణకు దూరమైన ఆ పిల్లలకు ట్రస్టే సర్వస్వమైన తరుణంలో, ఇలా తోటివారే కళ్ల ముందే విగతజీవులుగా మారడం ఎవరినైనా కంటతడి పెట్టిస్తుంది.
ప్రమాదం జరిగిన వెంటనే మృతదేహాలను పటాన్‌చెరులోని ప్రాచీన్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని, విద్యార్థుల పార్థివదేహాలకు నివాళులర్పించారు. ప్రాణాలతో బయటపడిన తోటి విద్యార్థులను ఓదార్చి, ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. చిన్నారుల అకస్మాత్ మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అలాగే, సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై తగిన చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. పండుగ వేళ పూల పూజలతో కళకళలాడాల్సిన చోట, చిన్నారుల ఆర్తనాదాలు మిగిలాయి.




