ACB Raids: ఏసీబీ వేటలో తిమింగలం.. డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌ ఇళ్లపై దాడులు.. రూ.వందల కోట్ల ఆస్తులు గుర్తింపు!

ACB Raids: మేడ్చల్‌ మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో రూ. వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు, భూముల కబ్జాల చిట్టా బయటపడింది.

Arun Chilukuri
Published on: 22 May 2026 2:22 PM IST
ACB Raids
X

ACB Raids: ఏసీబీ వేటలో తిమింగలం.. డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌ ఇళ్లపై దాడులు.. రూ.వందల కోట్ల ఆస్తులు గుర్తింపు!

ACB Raids: తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ (ACB) మరోసారి రైళ్లు పరిగెత్తించింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌ నివాసాలు, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఊహించని విధంగా రూ. వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు, ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గతంలో అత్యంత కీలకమైన శేరిలింగంపల్లితో పాటు పలు ఇతర ప్రాంతాల్లో ఆర్డీవో (RDO)గా పనిచేసిన వంశీమోహన్.. తన అధికార దుర్వినియోగంతో భారీగా ప్రభుత్వ భూములను కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌, పిగ్లీపురం పరిధిలో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన అక్రమంగా కబ్జా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

సదరు ప్రభుత్వ భూములను నకిలీ రికార్డులతో మొదట తన మామ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి.. ఆ తర్వాత ఒక ప్రముఖ రియల్టర్‌కు ధారాదత్తం చేసినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. ఆ డీల్‌కు ప్రతిఫలంగా సదరు రియల్టర్‌ నుంచి ఏకంగా 10 విలాసవంతమైన ప్లాట్లను తన పేరిట 'గిఫ్ట్‌ డీడ్‌' (Gift Deed) చేయించుకున్నట్టు ఏసీబీ పక్కాగా గుర్తించింది.

వంశీమోహన్‌ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లు, స్థిరాస్తి, చరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. వందల కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసినట్టు ఏసీబీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ అవినీతి నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story