Amazon: తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడి

Amazon: తెలంగాణ ఐటీ రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఆసన్నమైంది. చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడి.

Naresh.k
Published on: 15 July 2026 8:37 AM IST
Amazon
X

Amazon: తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడి

Bharat Future City: తెలంగాణ ఐటీ రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచ‌ర్ సిటీ వేదికగా తెలంగాణ సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుడుతోంది. గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారీ పెట్టుబడితో నిర్మించనున్న అత్యాధునిక డేటా సెంట‌ర్‌కు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి అమెజాన్ ప్రతినిధులతో జరిపిన కీలక చర్చల్లో రూ. 60 వేల కోట్ల పెట్టుబడికి సూచనప్రాయ ఆమోదం లభించింది. కేవలం 11 నెలల వ్యవధిలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్‌పై సంతకాలు జరిగాయి. తెలంగాణ చరిత్రలోనే ఇది అత్యంత భారీ టెక్నాలజీ పెట్టుబడుల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. మొత్తంగా 300 ఎకరాలను అమెజాన్ సంస్థకు కేటాయించారు.

అంతేకాకుండా, ఈ మెగా ప్రాజెక్టును ఆకర్షించేందుకు ప్రభుత్వం రూ.125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను కూడా ప్రకటించింది. ఈ డేటా సెంటర్ నిర్మాణం రాబోయే పదేళ్ల కాలంలో విడతల వారీగా సాగనుంది. తొలి విడతకు సంబంధించిన నిర్మాణ పనులు కేవలం 24 నెలల్లో పూర్తి కానున్నాయి. రాబోయే 10 ఏళ్లలో మొత్తం రూ. 60 వేల కోట్లను దశలవారీగా ఖర్చు చేస్తూ, దేశంలోనే అతిపెద్ద ‘హైపర్‌స్కేల్ డేటా సెంటర్లలో’ ఒకటిగా దీనిని తీర్చిదిద్దుతారు.

పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంత అభివృద్ధికి ఈ డేటా సెంటర్ గుండెకాయలా మారనుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, మౌలిక వసతులు, స్థానిక ఉపాధి అవకాశాలు ఊహించని రీతిలో పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు దేశంలో ముంబై మాత్రమే అమెజాన్ క్లౌడ్ రీజియన్‌కు కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును హైదరాబాద్ సొంతం చేసుకోబోతోంది. దేశంలోనే రెండో క్లౌడ్ రీజియన్‌ను అమెజాన్ ఇక్కడే ఏర్పాటు చేస్తోంది.

దీని ద్వారా..కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల విస్తరణ. డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ రంగాలకు అవసరమైన హై-స్పీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్టార్టప్‌లు, పారిశ్రామిక రంగానికి, ప్రభుత్వ డిజిటల్ సేవలకు పటిష్టమైన భద్రతతో కూడిన డేటా స్టోరేజ్ అందుబాటులోకి రానుంది.

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో లభిస్తున్న భూమి, నీరు, నిరంతర విద్యుత్, అద్భుతమైన రహదారులు, అన్నిటికీ మించి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా లభిస్తున్న వేగవంతమైన పరిపాలన అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తోంది. అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటుతో తెలంగాణ గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో టాప్ పొజిషన్‌కు దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story