చస్తేనే బిల్లులిస్తారా?.. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఫైర్!

Telangana: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే నిరసన గళాలు వినిపిస్తున్నాయి.

G Krishna
Published on: 26 Oct 2026 3:56 PM IST
Telangana
X

చస్తేనే బిల్లులిస్తారా?.. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఫైర్!

Anirudh Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే నిరసన గళాలు వినిపిస్తున్నాయి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు, బిల్లులు రాకపోవడంతో అధికార పార్టీ శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లులు విడుదల చేయకపోతే తాను చస్తే గానీ డబ్బులు ఇవ్వరా అంటూ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రుల నియోజకవర్గాలకేనా నిధులు?.. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రశ్న

రాష్ట్ర సచివాలయం , మంత్రుల తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం మంత్రుల ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే బిల్లులు చెల్లిస్తారా? అని నిలదీశారు. మిగతా జిల్లాల ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇటీవల ఓ కాంట్రాక్టర్ మృతి చెందిన తర్వాత ఆయనకు హడావుడిగా రూ.5 కోట్ల బిల్లు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

అంటే తన నియోజకవర్గ పనుల బిల్లుల కోసం తాను కూడా చనిపోతేనే ప్రభుత్వం స్పందిస్తుందా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో పూర్తయిన పనులతో పాటు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అవసరమైతే 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష

ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. అవసరమైతే ఏకంగా 30 వేల మంది అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ప్రభుత్వానికి మనుగడ ఉంటుందని హితవు పలికారు. కేవలం కొందరికే ప్రాధాన్యత ఇస్తే పరిణామాలు వేరేలా ఉంటాయని సంకేతాలు పంపారు.

నీళ్ల కోసం పార్టీలకు అతీతంగా పోరాటం

కేవలం బిల్లుల విషయమే కాకుండా, జడ్చర్ల నియోజకవర్గానికి సాగునీరు అందించే అంశంపై కూడా అనిరుధ్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. తాగు, సాగునీటి అవసరాల కోసం పార్టీలకు అతీతంగా పోరాడతామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వారి సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడబోమని తేల్చిచెప్పారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జడ్చర్లకు రావాల్సిన నిధులను, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే నేరుగా ప్రభుత్వ తీరును తప్పుబడుతూ బహిరంగంగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.