Pawan Kalyan: ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను.. అభిమాని నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్!
Pawan Kalyan: హనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్ అనారోగ్యంతో కన్నుమూశారు.
Pawan Kalyan: ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను.. అభిమాని నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్!
Pawan Kalyan: హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పవన్ కల్యాణ్ అభిమాని పొనుగంటి నిరంజన్ మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ వార్త పవన్ కల్యాణ్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. నిరంజన్ మరణవార్త తెలుసుకున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా నిరంజన్‌ను గుర్తుచేసుకుంటూ పవన్ కల్యాణ్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ నెటిజన్ల కన్నీళ్లు పెట్టిస్తోంది.
నిరంజన్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ పవన్ కల్యాణ్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు.."నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి... నన్ను చూడగానే అతడి ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు... ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అతడి శరీరం వ్యాధితో పోరాడుతున్నా.. మనసునిండా ధైర్యమే ఉంది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితంపై అతడు చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడు ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. అతడి చిరునవ్వు, అతడు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి."
జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్.. గత నెలలో స్వయంగా హనుమకొండలోని అతడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆ సమయంలో నిరంజన్‌ను ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ఆ సమయంలో తనకు కుక్కపిల్ల కావాలని నిరంజన్ అడగ్గా.. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఒక కుక్కపిల్లను కొని పంపించి తన పెద్ద మనసు చాటుకున్నారు. అంతేకాదు.. "మనం కలిసే ‘OG 2’ సినిమా చూద్దాం.. ఆ సినిమాలో నువ్వే నా స్పెషల్ గెస్ట్" అని పవన్ నిరంజన్‌కు ప్రామిస్ చేశారు. కానీ, అంతలోనే నిరంజన్ ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిరంజన్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు.
రియల్ హీరో, ప్రముఖ నటుడు సోనూ సూద్ సైతం నిరంజన్ మృతి పట్ల స్పందించారు. హనుమకొండలోని నిరంజన్ కుటుంబ సభ్యులతో సోనూ సూద్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. నిరంజన్ మృతికి సంతాపం తెలుపుతూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని సోనూ సూద్ హామీ ఇచ్చారు. నిరంజన్ మృతితో హనుమకొండలో విషాద ఛాయలు అలముకున్నాయి.




