Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?
Andhra Pradesh, Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతుండగా, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది.
Andhra Pradesh Telangana Weather Updates
AP, Telangana Weather Updates: గత కొన్ని రోజులుగా 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనాన్ని కలిగించే వార్త చెప్పింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ అంచనా:
ఉత్తర కోస్తా & యానాం: నేడు గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తూ, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు.
దక్షిణ కోస్తా: రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, వేడి మరియు తేమతో కూడిన అసౌకర్య వాతావరణం కొనసాగుతుంది.
రాయలసీమ: నేడు గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శనివారం వరకు అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది.
తెలంగాణ వాతావరణ హెచ్చరికలు:
తెలంగాణపై ఏర్పడిన ప్రతిచక్రవాత వలయం మరియు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
వర్ష సూచన: గురు, శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గాలి వేగం: వర్షం పడే సమయంలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతలు: వర్షాలు కురిసినప్పటికీ, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఎండల తీవ్రత ఇంచుమించు ఇలాగే కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
వాతావరణం మార్పు చెందే సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.




