Asifabad: జాగ్రత్త! మీరు తినే మామిడి పండు ప్రాణం తీయొచ్చు.. ఆసిఫాబాద్‌లో కార్బైడ్ పండ్లకు ఐదేళ్ల బాలుడు బలి!

Asifabad: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లు తిని ఐదేళ్ల బాలుడు శ్రీవర్ధన్ మృతి చెందగా.. మరో ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Arun Chilukuri
Published on: 18 May 2026 12:30 PM IST
Asifabad
X

Asifabad: జాగ్రత్త! మీరు తినే మామిడి పండు ప్రాణం తీయొచ్చు.. ఆసిఫాబాద్‌లో కార్బైడ్ పండ్లకు ఐదేళ్ల బాలుడు బలి!

Asifabad: వేసవి కాలంలో ఎంతో ఇష్టంగా తినే మామిడి పండ్లు ఓ నిరుపేద కుటుంబంలో తీరని శోకాన్ని నింపాయి. కృత్రిమ రసాయనాలతో (కార్బైడ్) మాగబెట్టిన మామిడి పండు తిని ఐదేళ్ల బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన హృదయవిదారక ఘటన తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వెలుగుచూసింది. దహెగాం మండలంలోని లోహ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్‌ మండలం కుంటమానుపల్లికి చెందిన పోర్తెట్టి శారద, శ్రీనివాస్‌ దంపతులు తమ పిల్లలతో కలిసి లోహ గ్రామానికి కూలి పనుల కోసం వచ్చారు. శనివారం తల్లి శారద తునికాకు సేకరణ కోసం అడవికి వెళ్ళింది. అదే రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శారద, శ్రీనివాస్‌ల కుమారుడు శ్రీవర్ధన్‌ (5), కుమార్తె కీర్తనతో పాటు మరో బాలుడు కీర్తి కుమార్‌ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులు వాంతులు, విరేచనాలతో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని కొంచవెల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పిల్లల ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.

అయితే దురదృష్టవశాత్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు చిన్నారులు మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వారిని ఆస్పత్రికి తరలించే లోపే.. ఐదేళ్ల బాలుడు శ్రీవర్ధన్‌ ఇంటి వద్దే కన్నుమూశాడు. మిగిలిన ఇద్దరు చిన్నారులు కీర్తన, కీర్తి కుమార్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించి ఐసీయూలో చేర్పించారు.

చిన్నారులు ఉన్నట్లుండి ఇలా విచిత్రంగా అస్వస్థతకు గురికావడం వెనుక అసలు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, బాధిత కుటుంబం ఉంటున్న ఇంట్లో క్యా్ల్షియం కార్బైడ్‌ (Calcium Carbide) తో కృత్రిమంగా మాగబెట్టిన మామిడి పండ్లు ఉన్నాయని, వాటిని తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందా? లేదా వేసవి తీవ్రతకు పిల్లలకు వడదెబ్బ (Sunstroke) తగలడం వల్ల ఇలా జరిగిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లాభాల కోసం కొందరు వ్యాపారులు విచ్చలవిడిగా వాడుతున్న రసాయన పండ్లు ప్రాణాంతకంగా మారుతుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story