Balkampet Yellamma : నేడు ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. ఆలయ పరిసరాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు

Balkampet Yellamma : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీ నేపథ్యంలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు విధించారు.

CR Reddy
Published on: 21 July 2026 9:18 AM IST
Balkampet Yellamma
X

Balkampet Yellamma 

Balkampet Yellamma : హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం మంగళవారం (జులై 21) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచే అమ్మవారి కళ్యాణ ఘట్టాలు షురూ కావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనసందోహంతో నిండిపోయింది. ఈ వేడుకను కళ్లారా వీక్షించేందుకు నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.

900 మందితో పటిష్ట భద్రత.. డ్రోన్ల నిఘా

అమ్మవారి కళ్యాణం మరియు రేపు జరగనున్న రథోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. దాదాపు 900 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్యూలైన్ల నియంత్రణకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ డైవర్షన్లు ఇవే

కళ్యాణోత్సవం, రథోత్సవం ముగిసే వరకు బల్కంపేట ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలకు నో ఎంట్రీ విధించారు. గ్రీన్‌ల్యాండ్స్, సత్యం థియేటర్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌ఆర్ నగర్, బీకే గూడ మీదుగా మళ్లిస్తున్నారు. అలాగే బేగంపేట, కట్టమైసమ్మ వైపు నుంచి వచ్చే వాహనాలకు కూడా డైవర్షన్లు విధించారు. ఎస్‌ఆర్ నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న బై లేన్లను తాత్కాలికంగా మూసివేశారు.

పార్కింగ్ స్థలాలు, ప్రత్యామ్నాయ మార్గాలు

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల కోసం అధికారులు 6 ప్రధాన ప్రాంతాల్లో పార్కింగ్ వసతి కల్పించారు. ముఖ్యంగా R&B కార్యాలయం, GHMC గ్రౌండ్, నేచర్ క్యూర్ ఆస్పత్రి ప్రాంగణాల్లో పార్కింగ్ స్థలాలను కేటాయించారు. వాహనదారులు, సాధారణ ప్రజలు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ విభాగం విజ్ఞప్తి చేసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story