Bandi Sanjay : బండి సంజయ్ ఇంట్లో విషాదం.. తల్లికి గుండెపోటు.. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. మరోవైపు బండి భగీరథ్ పోక్సో కేసులో న్యాయమూర్తిపై వస్తున్న ఆరోపణలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
Bandi Sanjay
Bandi Sanjay : కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుటుంబంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయన తల్లి శకుంతలమ్మ శనివారం హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలియగానే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స ప్రారంభించి, గుండెకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తన తల్లి అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే బండి సంజయ్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఒకవైపు తల్లి అనారోగ్యంతో బండి సంజయ్ ఆందోళనలో ఉండగా, మరోవైపు ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవి దేవిపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో.. న్యాయమూర్తి భర్తకు ఏదో పదవి ఆఫర్ చేస్తున్నారంటూ వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిపై జడ్జి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు తనను ఎంతగానో బాధించాయని ఆమె కోర్టులోనే వాపోయారు.
న్యాయమూర్తిపై వస్తున్న ఆరోపణలను తెలంగాణ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దృష్టికి తీసుకురాగా, వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న సదరు మెసేజ్‌లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు పంపి విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. న్యాయ వ్యవస్థపై బురద చల్లే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భగీరథ్ తరపు న్యాయవాదులు కూడా కోరారు. ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం న్యాయ విచారణను ప్రభావితం చేయడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం ఏమిటంటే.. బాధితురాలి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం చట్టరీత్యా నేరమని బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫోటోలను షేర్ చేసిన కొన్ని సోషల్ మీడియా ఖాతాదారులపై కేసులు నమోదు చేశారు. పోక్సో కేసులో బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.




