Bandi Sanjay: డెడ్ బాడీతో పోలీసుల రాజకీయాలేంటి?.. ఆర్టీసీ డ్రైవర్ మృతిపై బండి సంజయ్ తీవ్ర ధ్వజం!
Bandi Sanjay: వరంగల్‌లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ భౌతిక కాయం తరలింపు విషయంలో పోలీసుల తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు.
Bandi Sanjay: డెడ్ బాడీతో పోలీసుల రాజకీయాలేంటి?.. ఆర్టీసీ డ్రైవర్ మృతిపై బండి సంజయ్ తీవ్ర ధ్వజం!
Bandi Sanjay: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో వరంగల్ జిల్లాలో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. పోలీసుల తీరును, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
"డెడ్ బాడీతో పోలీసులకు రాజకీయాలేంటి? శంకర్ గౌడ్ భౌతిక దేహాన్ని పోలీసులు తీసుకెళ్లి ఏం చేసుకుంటారు?" అని బండి సంజయ్ ప్రశ్నించారు. 22 ఏళ్ల పాటు పనిచేసిన నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తన సహచరుడిని కడసారి చూసుకోవాలని తోటి కార్మికులు కోరుకోవడం తప్పా అని నిలదీశారు.
శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేట డిపో వద్ద ఉంచి నివాళి అర్పించాలన్నది కుటుంబ సభ్యుల కోరిక. కనీసం 5 నిమిషాల పాటు అక్కడ ఉంచేందుకు అనుమతి ఇవ్వడానికి పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? శంకర్ గౌడ్ ఇంటి ముందు టెంట్ వేసిన వారిని పోలీసులు బెదిరించడం దారుణమని, ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే వచ్చే బెనిఫిట్స్ (పరిహారం) కూడా ఆపుతామని కుటుంబ సభ్యులను భయపెడుతున్నారని ఆరోపించారు.
నివాళి అర్పించే సమయంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా తాను చూసుకుంటానని, కేవలం 5 నిమిషాల అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు. తమపై శవ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించడం సిగ్గుచేటన్నారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్ బాబు భౌతిక కాయం విషయంలో కాంగ్రెస్ నేతలు చేసింది శవ రాజకీయాలు కావా అని ప్రశ్నించారు.
ఆర్టీసీ కార్మికులేమైనా దొంగలా లేదా లంగలా? అని ప్రశ్నించిన బండి సంజయ్.. తమ సహచరుడికి నివాళి అర్పించాలనుకున్న వారిని అరెస్టు చేయడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. నివాళి అర్పించిన తరువాతే శాంతియుతంగా దహన సంస్కారాలు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.




