Bandi Sanjay: చావైనా, బతుకైనా కరీంనగరమే.. నా శవంపై కప్పేది కాషాయ జెండానే

Bandi Sanjay: సిఎం రేవంత్ రెడ్డి వలస వ్యాఖ్యలపై బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం. తన రక్తం కాషాయమని, కరీంనగర్ ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 13 April 2026 8:39 PM IST
Bandi Sanjay
X

Bandi Sanjay: చావైనా, బతుకైనా కరీంనగరమే.. నా శవంపై కప్పేది కాషాయ జెండానే

Bandi Sanjay: బండి సంజయ్ సైతం డాక్టర్ లక్ష్మణ్ మాదిరిగా ఏదో ఒక రాష్ట్రానికి వలస పోక తప్పదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘వలసపోవడానికి నేను అవకాశవాదిని కాదు. రేవంత్ రెడ్డిని అంతకంటే కాదు. చావైనా బతుకైనా కరీంనగరంతోనే. నా రక్తం కాషాయమే. నేను చనిపోతే నా శవంపై కప్పేది కూడా కాషాయ జెండానే. ఆ సన్నివేశం చూడటానికైనా రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు బతికి ఉండాలని కోరుకుంటున్నా’’అని పేర్కొన్నారు. ఆ ప్రకటనలో..

నేను చనిపోతే నా శవంపై కప్పేది కాషాయ జెండానే..

సీఎం వలసపోవడానికి నేను అవకాశవాదిని కాదు. రేవంత్ రెడ్డిని అంతకంటే కాదు. నా తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటా. నేను చనిపోతే నా శవంపై కప్పేది కాషాయ జెండానే. ఆ సన్నివేశం చూడటానికైనా మీరు నిండు నూరేళ్లు బతికి ఉండాలని కోరుకుంటున్నా.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులతో జరిగే నష్టమేమిటో చెప్పే దమ్ములేక రాజకీయం చేయాలనుకంటున్నారా? డీలిమిటేషన్ లో భాగంగా ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్ల పెంచితే దక్షిణాదికి జరిగే నష్టమేంది. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు స్రుష్టించి విభజించాలనుకుంటున్నారా? అసలు. మీరు చెప్పే శాస్త్రీయత ఏమిటి?. డబ్బు సమకూర్చే వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారా? డబ్బుకు, ఓటుకు, సీటుకు లింకు పెడతారా? లక్ష కోట్లు ఉన్న మీ కుటుంబానికి లక్ష ఓట్లు ఇవ్వాలా? డబ్బులేని పేదవాడికి ఓటు హక్కు కల్పించొద్దా?.

మీ లెక్క ప్రకారం ముంబయికి, ఢిల్లీకి మాత్రమే అత్యధిక సీట్లు ఉండాలా?. వెనుకబడ్డ ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరమే లేదా?. మీ హైబ్రీడ్ మోడల్ అంటే మీలాగే, కాంగ్రెస్ పార్టీలాగే దోచుకునే వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలా?.మీ పార్టీ సిద్దాంతం ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనిషికి విలువ లేదా?. కనీసం మనిషిగా కూడా ఆలోచించలేని స్థాయికి దిగజారుతున్నావా?. కాంగ్రెస్ పార్టీ మిమ్ముల్ని మనీ(ర) మనిషిగా మార్చిందా?. మీలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా నిజం మాట్లాడండి.

అంతెందుకు ఇప్పుడు దక్షిణాది లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇది చేసింది మీ పార్టీ నే కదా?. అయినా ప్రతీది రాజకీయం చేయడం తప్ప మనిషిగా ఆలోచించే తత్వమే మీకు లేదా?. విభజన అనేది మీ పార్టీ డీఎన్ఏ లోనే ఉన్నట్టు ఉంది. విభజించు పాలించు అనే బ్రిటీష్ సిద్ధాంతాన్ని ఒంట బట్టించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకంటే ఏం చెప్పగలరు?

రాసుకోవడానికి పేపర్లు, చూసుకోవడానికి టీవీలుంటే సరిపోతుందా?. నేను సవాల్ చేస్తున్నా ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాధికి జరిగే నష్టమేంటి?. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేయాలని చెబుతున్నారా? యూపీఏ సర్కార్ చెప్పిన ఏపీ పునర్విభజన యాక్ట్ ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుండి 153కు మాత్రమే పరిమితం చేయాలా? మీరు చెప్పిన ఆర్ధిక (జీఎస్డీపీ) సూత్రం ప్రకారమే డీలిమిటేషన్ చేయాలా?

మీ లెక్క ప్రకారం ఈ దేశంలో ఎవరికి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంటే అన్ని లక్షల ఓట్తు ఇవ్వాలా? తెలంగాణసహా ఈ దేశంలో దళితుడికి, బడుగు, బలహీన వర్గాలకు ఇంకా చెప్పాలంటే పేదవాడికి(బీపీఎల్ కుటుంబానికి) ఓటు హక్కే ఇవ్వకూడదా? అసలు మీరు సీఎంగా ఉంటూ మాట్లాడుతున్నారా? లేక హైకమాండ్ కు ఠంచన్ గా మూటలు అప్పజెప్పే క్రమశిక్షణ కలిగిన వ్యాపార, వాణిజ్య నాయకుడిగా మాట్లాడుతున్నారా?

రేవంత్ రెడ్డి ఈ దేశానికి రక్ష, దక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే కదా? రేపు అంబేద్కర్ జయంతి కదా పుట్టిన రోజే అంబేద్కర్ సిద్దాంతాలను చంపేయాలని చూస్తన్నారా? అంబేద్కర్ బతికినంత కాలం కాంగ్రెస్ పార్టీ ఆయనను అడుగడుగునా అవమానించింది సరిపోలేదనుకుంటున్నారా? కనీసం అంబేద్కర్ రాజ్యాగంలో ఓటు హక్కు గురించి డీలిమిటేషన్ గురించి ఏమి రాశారో కూడా చదవలేని స్థితిలో ఉన్నారా? హైకమాండ్ కు మూటలు పంపే టెన్షన్ లో తెలిసి కూడా తెలియనట్లు ఉన్నారా? అని ఘాటుగా విమర్శించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story