Weather Update : గంటకు 60 కి.మీ వేగంతో ఈదురు గాళ్లు.. ఉరుములు, మెరుపులతో తెలంగాణలో దంచికొట్టనున్న వానలు

Weather Update : తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్ 10 లోపే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన సంకేతాల వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

CR Reddy
Published on: 8 Jun 2026 7:30 AM IST
Weather Update
X

Weather Update

Weather Update : తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని సమాచారం అందించింది. ఎంతో కాలంగా రైతులు, సామాన్య ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ నెల 10వ తేదీన లేదా అంతకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇటు అరేబియా సముద్రం, అటు బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారడంతో రుతుపవనాలు చాలా వేగంగా ముందుకు కదులుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఇవి తెలంగాణ సరిహద్దులను తాకనున్నాయని అంచనా వేస్తున్నారు.

ఈసారి కాస్త ఆలస్యంగా కేరళలోకి ఎంట్రీ

సాధారణంగా ప్రతి ఏటా జూన్ ఒకటో తేదీనే దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు.. ఈసారి ఎల్ నినో ప్రభావం కారణంగా కాస్త ఆలస్యంగా జూన్ 4వ తేదీన కేరళను తాకాయి. అయితే అక్కడ ప్రవేశించిన తర్వాత కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవి ఇప్పటికే విస్తరించాయి. ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా మంచి వర్షాలు కూడా కురిశాయి. ఈ ఏడాది మొత్తం సీజనల్ వర్షపాతం సాధారణం కంటే కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు భావించినప్పటికీ, ప్రస్తుతం స్థానికంగా ఏర్పడిన వాతావరణ మార్పులు, బంగాళాఖాతంలో మారుతున్న సమీకరణాలు వర్షాలు పడటానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి.

రుతుపవనాల కంటే ముందే ముందస్తు జల్లులు

నైరుతి రుతుపవనాలు అధికారికంగా రాష్ట్రంలోకి రాకముందే తెలంగాణ అంతటా వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. ఆకాశంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రానున్న రెండు, మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వర్షం పడే సమయంలో గాలివేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దీనితో పాటు బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరించారు.

వర్షాలు కురిసే జిల్లాల వివరాలు ఇవే

వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. నేడు కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది.

రైతులు, ప్రజలకు జాగ్రత్తలు

ప్రస్తుతం బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ మధ్య భాగాల్లో నైరుతి దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. దీనివల్ల ఉపరితల ఆవర్తనాలు మరింత తీవ్రరూపం దాల్చి, త్వరలోనే అల్పపీడనంగా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్ష సూచన ఉన్నందున రైతులు తమ ముందస్తు వ్యవసాయ పనులకు, విత్తనాలు చల్లడానికి సిద్ధం కావచ్చునని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అయితే పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఉరుములు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద ఉండరాదని ఐఎండీ హెచ్చరించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story