BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్.. మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ కీలక భేటీ!
BJP: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్ఠానం పట్టు బిగిస్తోంది.
BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్.. మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ కీలక భేటీ!
BJP: వచ్చే ఎన్నికలకు సన్నాహకంగా బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావడంతో పాటు ఏపీలో పట్టు పెంచుకోవడానికి బీజేపీ హైకమాండ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ దిశగా జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు ఇరు రాష్ట్రాల్లో.. రెగ్యూలర్ గా పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మోడీ.. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తికావడంతో.. దీని ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులను కలిసి, బీజేపీలోకి చేర్చుకునే విధంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రధాని మోడీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన, సాధించిన విజయాలపై రూపొందించిన పుస్తకాన్ని.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, సింగర్ శ్రీలలితను కలిసి అందజేశారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఆయన గాయని శ్రీలలిత నివాసానికి వెళ్లిన.. ప్రహ్లాద్ జోషి కాసేపు ఆమెతో భేటీ అయ్యారు. కర్ణాటక, హిందుస్తానీ సంగీత శైలులు రెండింటిలోనూ రాణిస్తున్న శ్రీలలితను అభినందించారు.
ఇప్పుడు తాజాగా, మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు భేటీ అయ్యారు. ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు చేరవేసే.. విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమ విశేషాలను చిరంజీవికి వివరించారు. ఇప్పటికే పలువురు సినీ, బిజినెస్ ప్రముఖులతో రామచంద్రరావు వరుసగా భేటీ అయ్యారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలవడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతుంది.
బెంగాల్ ఎన్నికల ఫలితాలకు ముందు వరకూ.. తెలంగాణలో బీజేపీ అంటే టాప్ 3 పార్టీ కిందే లెక్క. కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్వాతే బీజేపీ స్థానం అన్నట్టు ఉండేది. కానీ.. ఇకపై తామే నంబర్ 1 అవుతామని ఆ పార్టీ సీనియర్ నేతలు తేగేసి చెబుతున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ లాంటి వారు.. తెలంగాణలో రాజకీయ భూకంపం సృష్టిస్తామని.. మరో అడుగు ముందుకేసి మరి చెప్పేస్తున్నారు. ఈ స్థాయిలో కాన్ఫిడెన్స్ పెరిగేలా చేసింది బెంగాల్ రిజల్ట్. అంతే కాదు, తెలంగాణలో అధికారం చేపట్టడానికి కలిసొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం లేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 2028లో జరగాల్సి ఉంది. అప్పటికల్లా పార్టీని బలంగా పాతుకుపోయేలా చెయ్యాలనే వ్యూహం ఉంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ కొంత ప్రభావం చూపిస్తోంది. దక్షిణాదిన కూడా విస్తరించేలా వ్యూహాలున్నాయి. ఇక ఇప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కదలికలు రాజకీయ వేడిని పెంచేలా ఉండటం ఖాయం. అవి నానాటికీ జోరందుకుంటూ.. ఎన్నికల నాటికి పీక్స్‌కి చేరగలవు. మరి రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఎలా ప్రజల మనసు గెలుచుకుంటుంది? ప్రజలు ఎలా మార్పును కోరుకుంటారు అనేది తేలాల్సిన అంశం.




