BJP : అసెంబ్లీ ముట్టడికి సిద్ధమైన బీజేపీ శ్రేణులు.. హైదరాబాద్‌లో భారీగా మోహరించిన పోలీసులు
BJP : ఎన్నికల హామీల అమలు కోరుతూ నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. రాంచందర్ రావు నేతృత్వంలో భారీ నిరసన చేపట్టడంతో హైదరాబాద్ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.
BJP
BJP : తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) నేడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమైందని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు అసెంబ్లీ ముట్టడికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరం అంతటా ఖాకీల పహారా పెరిగింది. ఎక్కడికక్కడ బారికేడ్లు, ముందస్తు అరెస్టులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అసెంబ్లీ ముట్టడికి కమలనాథుల పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా, ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేరలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడం, ఫసల్ బీమా పథకాన్ని పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో నేడు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. నిరుద్యోగులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాని విద్యార్థులు, ఇళ్లు రాని పేదలు, పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులంతా ఈ ముట్టడిలో పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విడతల వారీగా అసెంబ్లీని చుట్టుముట్టేందుకు వ్యూహరచన చేశారు.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కావాల్సిందే
ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించిందని, ఇప్పుడు వాటిని అటకెక్కించిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ హామీలకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని, లేదంటే ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మరని ధ్వజమెత్తుతున్నారు. కేవలం గాలి మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని, బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రాంచందర్ రావు విమర్శించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని, మౌలిక సదుపాయాల కల్పనలో దారుణంగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
ఖైరతాబాద్ నుంచి గన్ పార్క్ వరకు ఖాకీల పహారా
బీజేపీ అసెంబ్లీ ముట్టడి పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీకి వచ్చే అన్ని దారుల్లో భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జిల్లాల నుండి వచ్చే నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఖైరతాబాద్, నాంపల్లి, సెక్రటేరియట్ దారుల్లో ఎటు చూసినా పోలీసు బలగాలే కనిపిస్తున్నాయి. అనుమానిత వాహనాలను తనిఖీ చేయడంతో పాటు, గన్ పార్క్ వద్ద ఎవరినీ అనుమతించడం లేదు. లోకల్ లీడర్లను పోలీసులు హౌస్ అరెస్టులు చేయడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు, నిరుద్యోగుల గొంతుకగా బీజేపీ
రాష్ట్రంలో యూరియా కొరత, సాగునీటి సమస్యలతో రైతులు విలవిలలాడుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా పథకం ద్వారా భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, స్కాలర్‌షిప్పులు అందక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల పక్షాన పోరాడుతామని బీజేపీ స్పష్టం చేసింది. నేటి ముట్టడి ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారు.




