BL Santhosh: కాంగ్రెస్ ‘కోవర్టులను’ వదిలేసి మాపై అరుపులా?: హస్తం పార్టీకి బీఎల్ సంతోష్ ఘాటు కౌంటర్!

BL Santhosh: ఏఐసీసీ ఇన్‍ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా పెను సంచలనం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 10 Jun 2026 2:34 PM IST
BL Santhosh
X

BL Santhosh: కాంగ్రెస్ ‘కోవర్టులను’ వదిలేసి మాపై అరుపులా?: హస్తం పార్టీకి బీఎల్ సంతోష్ ఘాటు కౌంటర్!

BL Santhosh: ఏఐసీసీ (AICC) వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ (Meenakshi Natarajan Nomination Rejected) ఉదంతం కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర స్థాయి పొలిటికల్ వార్‌కు దారితీసింది. నామినేషన్ తిరస్కరణను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతుండగా.. బీజేపీ సైతం అంతే దీటుగా కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ (BL Santhosh) సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం (EC) ఈ నిర్ణయం తీసుకుందని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో వాస్తవాలను ఎందుకు దాచిపెట్టారో సమాధానం చెప్పాలని, తప్పు చేసి దాన్ని ఇతరులపైకి నెట్టడం సరికాదని హితవు పలికింది.

ఈ వివాదంపై బీజేపీ జాతీయ కీలక నేత బీఎల్ సంతోశ్ రంగంలోకి దిగి కాంగ్రెస్ అంతర్గత విభేదాలను ఎండగట్టారు. "మీనాక్షి నటరాజన్ కేసు గురించిన పూర్తి వివరాలను, ఆమె దాచిపెట్టిన వాస్తవాలను బయటపెట్టిన ఆ 'తెలంగాణ కాంగ్రెస్ కోవర్ట్' ఎవరు? మీ సొంత పార్టీలోని కోవర్ట్ చేసిన పనిని పట్టుకోకుండా, బీజేపీ మీద అరుపులు, కేకలు వేయడం ఏంటి? ముందు మీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కోవర్టులను గుర్తించి, వారిని అదుపులో పెట్టుకోండి" అంటూ బీఎల్ సంతోశ్ ఎద్దేవా చేశారు.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ లోపల ఉన్న కొందరు నేతలే పరోక్షంగా కారణమంటూ బీజేపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు ఆ గుట్టు రట్టు చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేత ఎవరనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story