Hyderabad: "నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలి".. బొల్లారం చిన్నారి హత్య కేసులో డిసిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత!
Hyderabad: బొల్లారంలో ఐదేళ్ల చిన్నారి మోజెస్ అరేలియా హత్య కేసులో నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని బంధువులు, స్థానికులు ఆందోళన చేపట్టారు.
Hyderabad: "నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలి".. బొల్లారం చిన్నారి హత్య కేసులో డిసిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత!
Hyderabad: సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంలో జరిగిన ఐదేళ్ల చిన్నారి మోజెస్ అరేలియా (5) దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని తమకు అప్పగించాలంటూ బంధువులు, విల్లా ఆర్చిడ్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు డీసీపీ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.
ఈ కేసు దర్యాప్తు వివరాలను డీసీపీ సుమతి మీడియాకు వెల్లడించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు. ‘‘నిందితుడి కోసం పోలీసులు సుమారు 10 ప్రత్యేక బృందాలతో గాలించారు. విల్లాలోని క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించాం. గతంలో అదే గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేసి మానేసిన విక్రమ్ కుమార్‌ను అనుమానించి అదుపులోకి తీసుకున్నాం’’ అని డీసీపీ తెలిపారు.
చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేయాలని విక్రమ్ భావించినట్లు విచారణలో తేలింది. చిన్నారి కుటుంబాన్ని ధనిక కుటుంబంగా భావించి డబ్బులు ఇస్తారని ఆశపడ్డాడని, అయితే చిన్నారిని బయటకు తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో ముందుగానే హత్య చేశాడని వెల్లడించారు.
క్లబ్‌హౌస్ దగ్గర ఉన్న చిన్నారి మోజెస్‌ను సెల్లార్‌లోకి తీసుకెళ్లిన విక్రమ్.. కాళ్లు, చేతులు కట్టేసి, శరీరానికి పెద్ద రాయి కట్టి నీటి సంపులో పడేశాడు. చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాక, రాత్రి 7:30 గంటల సమయంలో సెల్లార్ నుంచి ఒక్కడే బయటకు వచ్చి సాధారణంగా సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి వెళ్లిపోయాడు. చిన్నారిని చంపి సంపులో పడవేసిన తర్వాతే తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్యలో విక్రమ్ కుమార్ ఒక్కడే పాల్గొన్నాడని, మరెవరి ప్రమేయం లేదని డీసీపీ సుమతి స్పష్టం చేశారు.




