BRS 25th Foundation Day: పాతికేళ్ల ప్రస్థానం.. ప్రజల కోసం పోరాటం: బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేళ కేటీఆర్, హరీష్ రావు ఉద్వేగం
BRS 25th Foundation Day: బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
BRS 25th Foundation Day: పాతికేళ్ల ప్రస్థానం.. ప్రజల కోసం పోరాటం: బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేళ కేటీఆర్, హరీష్ రావు ఉద్వేగం
BRS 25th Foundation Day: భారత్ రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరియు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలంగాణ ప్రజలకు, గులాబీ సైనికులకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇది పార్టీ కాదు.. ఒక విప్లవం: కేటీఆర్
బీఆర్‌ఎస్ ప్రస్థానాన్ని వివరిస్తూ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. "నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. బీఆర్‌ఎస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు.. అది ఒక విప్లవం," అని ఆయన పేర్కొన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ వేడుకను జరుపుకోవడం గర్వకారణమని, ఇది 25 వసంతాల మహోజ్వల లాంగ్ మార్చ్ అని ఆయన అభివర్ణించారు.
రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి: హరీష్ రావు
మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఘాటుగా స్పందించారు. ఉద్యమ సమయంలోనైనా, అధికారంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా.. బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ.. "రాష్ట్రంలో సంక్షేమం అడుగంటింది, అభివృద్ధి నిలిచిపోయింది. అరాచకం తాండవిస్తున్న ఈ కాలంలో ప్రజల గుండెల్లో ఒకటే నినాదం మార్మోగుతోంది. అదే.. ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’," అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.




