KTR: పెట్టుబడుల్లో బెంగళూరునే దాటేశాం.. తప్పు అని నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా: కేటీఆర్ సవాల్!

KTR: పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించామని, కేసీఆర్ హయాం నాటి అభివృద్ధిని తప్పు అని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు.

Arun Chilukuri
Published on: 3 Jun 2026 12:01 PM IST
KTR
X

KTR: పెట్టుబడుల్లో బెంగళూరునే దాటేశాం.. తప్పు అని నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా: కేటీఆర్ సవాల్!

KTR: హైదరాబాద్‌లో జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు సాగిన సుసంపన్నమైన పాలనను, సాధించిన ప్రగతిని గణాంకాలతో సహా వివరిస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలకు శాశ్వత రాజకీయ సన్యాస సవాల్ విసిరారు.

తెలంగాణ వచ్చాక ఐటీ మరియు పెట్టుబడుల సాధనలో కర్ణాటక రాజధాని బెంగళూరును సైతం హైదరాబాద్ అధిగమించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక మార్పులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2014 నాటికి తెలంగాణలో సాగుభూమి విస్తీర్ణం కేవలం 1.50 కోట్ల ఎకరాలు మాత్రమే ఉండేది. 2023 నాటికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి సాగు భూమి విస్తీర్ణం ఏకంగా 2.29 కోట్ల ఎకరాలకు చేరింది.

"రాష్ట్రాన్ని పరిపాలించే నాయకత్వ పటిమ ఉందా? అని ఆనాడు కొందరు ఎగతాళి చేశారు. కానీ, పక్క రాష్ట్రాల ప్రజలు కూడా మాకు కేసీఆర్‌లాంటి పాలకుడు కావాలని కోరుకునేలా పదేళ్ల పాటు పాలన సాగింది. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది" అని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు.

"వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే. ఎన్నికల అజెండాలో లేకపోయినప్పటికీ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా కేసీఆర్ పెట్టుబడి సాయం అందించే 'రైతు బంధు' పథకాన్ని తెచ్చారు. తలసరి ఆదాయంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాం. నేను చెప్పిన ఈ అభివృద్ధి గణాంకాలన్నీ తప్పు అని నిరూపిస్తే.. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా" అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడుతు.. "కేసీఆర్ చేసిన సుదీర్ఘ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందనేది నిర్వివాదాంశం. కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రం ఇచ్చినప్పటికీ.. ఇవ్వక తప్పని రాజకీయ పరిస్థితిని దేశంలో సృష్టించింది మాత్రం ముమ్మాటికీ కేసీఆర్‌యే" అని వెల్లడించారు.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను తమ స్వంత కుటుంబంగా భావించి పాలించామని కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. "ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకులు పదవిలో కూర్చోవడమే అత్యంత బాధాకరంగా ఉంది. నాడు తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టిన వ్యక్తి (సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ) ఈరోజు అధికార పీఠంపై ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది" అని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story