Balka Suman: తెలంగాణ భవన్‌లో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్!
Balka Suman: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
Balka Suman: తెలంగాణ భవన్‌లో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్!
Balka Suman: భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో హైడ్రామా నడుమ ఈ అరెస్ట్ పర్వం కొనసాగింది. బాల్క సుమన్ తెలంగాణ భవన్‌లో ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు భారీ బలగాలతో అక్కడకు చేరుకున్నారు.
పోలీసులు తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా 'గో బ్యాక్' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ అనుబంధ న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై అబిడ్స్ ఏసీపీ స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఇలాంటి కేసుల్లో ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్ వెలుపల పోలీసులు భారీగా మోహరించడంతో, కొంత సమయం తర్వాత బాల్క సుమన్ స్వయంగా బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అనంతరం ఆయన పోలీసులకు సహకరిస్తూ అరెస్ట్ అయ్యారు. అనంతరం పోలీసులు ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్‌కు ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:
నన్ను జైలుకు పంపి పైశాచికానందం పొందుతున్నారు: "తెలంగాణ ఉద్యమ సమయం నుండి నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఉద్యమ కాలంలో నాపై 250కి పైగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇటీవలే క్యాతనపల్లి ఎన్నికల సమయంలోనూ నన్ను జైలుకు పంపారు. ఇప్పుడు మరోసారి నన్ను జైల్లో పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్ నిర్ణయించారు. నన్ను వేధించి వారు పైశాచికానందం పొందాలని చూస్తున్నారు."
సింగరేణిలో వందల కోట్ల కుంభకోణం: "నాపై కక్షసాధింపు చర్యలు పెట్టే శ్రద్ధలో సగమైనా ప్రజల సమస్యలపై పెట్టాలి. ప్రస్తుతం సింగరేణిలో వందల కోట్ల విలువైన స్కాములు జరుగుతున్నాయి. సింగరేణి పూర్తిగా కుంభకోణాలమయంగా మారిపోయింది."
"కాంగ్రెస్ పాలకులు దేశంలో ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం వీరికి అలవాటుగా మారింది. నాకు చట్టం, వ్యవస్థలు, రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉంది. నేను ఎక్కడికీ పారిపోలేదు, పార్టీ కార్యకలాపాల్లోనే ఉన్నా. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తున్నా" అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.




