Suryapet: బీఆర్‌ఎస్ నేత చింతలపాటి మధు దారుణ హత్య.. మూడు ముక్కలుగా నరికి కాలువలో వేసిన దుండగులు!
Suryapet: సూర్యాపేట జిల్లా యర్కారంలో దారుణం జరిగింది. బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు.
Suryapet: బీఆర్‌ఎస్ నేత చింతలపాటి మధు దారుణ హత్య.. మూడు ముక్కలుగా నరికి కాలువలో వేసిన దుండగులు!
Suryapet: సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో దారుణ హత్య వెలుగుచూసింది. స్థానిక బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త అయిన చింతలపాటి మధు (నిన్న రాత్రి) కిరాతకంగా నరికి చంపబడ్డారు. దుండగులు ఆయన శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి, మూడు గోనెసంచుల్లో కుక్కి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ (SRSP) కాలువలో పడేశారు. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారడంతో పాటు ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిన్న రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. పక్కా స్కెచ్‌తో వచ్చిన దుండగులు మధుపై కత్తులు, గొడ్డళ్లు, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. మధు ముఖం గుర్తుపట్టలేని విధంగా మార్చేసి, ఆపై శవాన్ని ముక్కలు చేసి గోనె సంచుల్లో కట్టి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడేసి పరారయ్యారు.
రాజకీయ హత్యలకు, పాత కక్షలకు యర్కారం గ్రామం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 1985 నుంచి ఇప్పటివరకు ఈ గ్రామంలో వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 9 మంది నాయకులు హత్యకు గురికావడం గమనార్హం. తాజాగా హత్యకు గురైన చింతలపాటి మధు.. గతంలో జరిగిన ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నారు. అలాగే, 2004లో జరిగిన నాటి సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో ఈ మధు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అప్పటి పాత కక్షల నేపథ్యంలోనే ఈ రీవెంజ్ మర్డర్ జరిగి ఉండవచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.
హత్యకు గురైన చింతలపాటి మధు భార్య, యర్కారం మాజీ సర్పంచ్ మౌనిక ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే హత్య చేశారని ఆమె నేరుగా ఆరోపించారు. గతంలో హత్యకు గురైన మిద్దె రవీందర్ కుమారుడితో పాటు మరో 15 మంది కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.




