CAG Report: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ మొట్టికాయలు

CAG Report: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సంచలన నివేదిక. ₹5.62 లక్షల కోట్ల అప్పులు, జీహెచ్‌ఎంసీలో నిధుల దుర్వినియోగం, సింగరేణిలో అక్రమాలపై కీలక వ్యాఖ్యలు.

KVD Varma
Published on: 30 March 2026 12:47 PM IST
CAG Report: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సంచలన నివేదిక.
X

CAG Report

CAG Report: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ కీలక నివేదిక విడుదల చేసింది. ఆయాసంస్థల్లో 2023 వరకు జరిగిన ఆర్ధిక లావాదేవీలను విశ్లేషించిన కాగ్ ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలపై తీవ్ర అభ్యంతరాలువ్యక్తం చేసింది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో చెత్త సేకరణ, సింగరేణిలో డీజిల్ వినియోగం, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పరిమితిని మించిపోవడం వంటి అంశాలను కాగ్ ఎత్తిచూపింది.

మున్సిపల్ శాఖలో ఆర్థిక లోపాలు

రాష్ట్రంలోని అర్బన్ లోకల్ బాడీస్ లో ఆర్ధిక క్రమశిక్షణ పూర్తిగా లేకుండా పోయిందని కాగ్ చెప్పింది. సుమారు 324.96 కోట్ల రూపాయల లైబ్రరీ సెస్ సరిగా వసూలు కాలేదని రిపోర్ట్ లో పేర్కొంది. అదేవిధంగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు గాలికి వదిలేశారని చెప్పిన కాగ్.. చెత్త వర్గీకరణ లక్ష్యం అమలు కాకపోవడం, మిక్స్‌డ్ వేస్ట్‌ను నేరుగా డంపింగ్ యార్డులకు తరలించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ జరగకపోయినా కాంట్రాక్టర్లకు ₹313.20 కోట్లు చెల్లించదాన్ని కాగ్ రిపోర్ట్ ఎత్తి చూపింది.

ప్రభుత్వ రంగ సంస్థల దుస్థితి

తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితి దయనీయంగా ఉందని కాగ్ పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, అందులో 16 సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయి లేదా లిక్విడేషన్‌లో ఉన్నాయి. పనిచేస్తున్న 67 సంస్థల్లో 49 సంస్థలు తమ యాన్యువల్ ఎకౌంట్స్ సబ్మిట్ చేయడంలో ఆలస్యం చేశాయి. అకౌంట్స్ అందుబాటులో ఉన్న 18 సంస్థలలో 11 సంస్థలు నష్టాల్లో ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. ఈ సంస్థల మొత్తం నికర విలువ ₹50,930 కోట్లు మేర తగ్గిపోయిందని, 9 సంస్థల ఆస్తులు పూర్తిగా నష్టాలతో మిగలకుండా పోయాయని కాగ్ చెప్పింది.

సింగరేణిలో..

సింగరేణి కాలరీస్ కంపెనీపై నిర్వహించిన ప్రత్యేక ఆడిట్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డీజిల్ వినియోగంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ₹251 కోట్ల అనవసర ఖర్చు జరిగిందని కాగ్ పేర్కొంది. ఒప్పంద ఉల్లంఘనల వల్ల ₹74 కోట్ల అదనపు భారం పడటమే కాకుండా, బొగ్గు రవాణాలో లోపాల వల్ల ₹25 కోట్ల నష్టం వాటిల్లింది. పర్యావరణ నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు లేకపోవడాన్ని కూడా నివేదిక తప్పుబట్టింది.

FRBM లక్ష్యాలు- పెరుగుతున్న అప్పులు

తెలంగాణ రాష్ట్ర రుణ భారం భారీగా పెరుగుతోందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర మొత్తం అప్పులు ₹5.62 లక్షల కోట్లకు చేరాయని, ఇది జీఎస్‌డీపీ (GSDP) లో 34.29 శాతంగా ఉందని తెలిపింది. ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనల ప్రకారం ఉండాల్సిన 32.8% పరిమితిని రాష్ట్రం మించిపోయింది. బడ్జెట్ కేటాయింపుల కంటే ₹31,229 కోట్లు అదనంగా ఖర్చు చేయడం ఆర్థిక అస్తవ్యస్తతకు నిదర్శనమని కాగ్ వివరించింది.

కాగ్ సూచనలు

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల పనితీరుపై ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలని కాగ్ సూచించింది. ఎకౌంట్స్ సబ్మిట్ చేయడంలో ఆలస్యాన్ని నివారించాలని, పర్యావరణ నిధుల ఏర్పాటులో కఠినంగా వ్యవహరించాలని కోరింది. ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణలో వార్డ్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసి, మానిటరింగ్ టీమ్‌ల ద్వారా పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేసింది.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story