Sircilla: క్షేత్రస్థాయి అధికారులను హై అలెర్ట్ చేసిన సీఎస్ సంజయ్ జాజు!
Sircilla: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Sircilla: క్షేత్రస్థాయి అధికారులను హై అలెర్ట్ చేసిన సీఎస్ సంజయ్ జాజు!
సిరిసిల్ల: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. వర్షాలు, వరదల ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భారీ వర్షాల పరిస్థితిపై సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జిల్లాల్లో 24 గంటలూ కంట్రోల్ రూమ్‌లు పనిచేయాలని, అధికారులు తమ కేంద్ర కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కురిసిన వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, చేపట్టిన సహాయక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చోట ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రజల నుంచి సమాచారం అందిన వెంటనే స్పందించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో టామ్‌టామ్ ద్వారా ప్రజలకు అప్రమత్తత సూచనలు అందించాలని, పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, నదుల వద్దకు ప్రజలు, పశువుల కాపరులు, మత్స్యకారులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తోందని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ గడ్డం, డీఆర్ఓ జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీఓ శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




