Revanth Reddy: కుల వ్యవస్థ నిర్మూలనకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు.. గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ ఫైర్!
Revanth Reddy: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.
Revanth Reddy: కుల వ్యవస్థ నిర్మూలనకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు.. గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ ఫైర్!
Revanth Reddy: "తెలంగాణలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది" అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ. 15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తొలి టీపీఎస్ బడిని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ ప్రక్షాళన, గత ప్రభుత్వ విద్యా విధానాలపై నిప్పులు చెరిగారు.
సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అందాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం అన్నారు. ఇందుకోసమే రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు రూ. 27 వేల కోట్లను విద్యాశాఖకే కేటాయించామని వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషీ అనే అపోహలను తల్లిదండ్రుల్లో తొలగించేందుకే ఈ అత్యాధునిక పాఠశాలలను తెచ్చామన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివి ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు అయిన వారు ఎందరో ఉన్నారని, ఇక్కడి నుంచే మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని భరోసా ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ వర్గానికో స్కూల్ పెట్టి సమాజంలో కుల వ్యవస్థను ప్రోత్సహించింది. కానీ, మా ప్రభుత్వం కుల వ్యవస్థను నిర్మూలించేందుకు, అందరు పిల్లలు కలిసి చదువుకునేలా 'ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల' నిర్మాణానికి శ్రీకారం చుట్టింది" అని ప్రకటించారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేందుకే 'విద్యా కమిషన్'ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
త్వరలోనే రాష్ట్రంలో 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని ప్రారంభించబోతున్నట్లు సీఎం వెల్లడించారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే విపక్షాలు విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన యూనిఫామ్‌లు నెల రోజులకే చిరిపోయేవని, కానీ తమ ప్రభుత్వం క్వాలిటీ విద్యా కిట్లను ఇస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. "విద్యా కిట్ల పంపిణీ కోసం మేము రూ. 680 కోట్లతో టెండర్లు పిలిస్తే.. అందులో రూ. 2,000 కోట్ల స్కామ్ జరిగిందని ఒకాయన (విపక్ష నేతలను ఉద్దేశించి) మాట్లాడుతున్నారు. అసలు రూ. 680 కోట్ల టెండర్లలో రూ. 2 వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యమో ఆ మేధావికే తెలియాలి" అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ విద్యా రంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.




