Revanth Reddy: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1వ తేదీనే జీతాలు వచ్చేలా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Revanth Reddy: తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Arun Chilukuri
Published on: 8 July 2026 3:14 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1వ తేదీనే జీతాలు వచ్చేలా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Revanth Reddy: రాష్ట్ర పరిపాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా అందించేందుకు డిజిటల్ గవర్నెన్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలు, విధివిధానాలు రూపొందించాలని సూచించారు. MCR HRDలోని బోధి పెవిలియన్‌లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవా వివరాలు, వేతనాలు, బ్యాంక్ ఖాతా వివరాలు తదితర సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందేలా వ్యవస్థను రూపొందించవచ్చని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా నేరుగా లబ్ధిదారులకు చేరేలా డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 4,800 కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఏజెన్సీలు పనిచేస్తుండగా, అందులో దాదాపు 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ ప్రయోజనాలు కల్పించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించినప్పటికీ ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందడం లేదని తెలిపారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు పారదర్శకంగా జీతాలు చెల్లించే విధంగా డిజిటల్ వ్యవస్థను రూపొందించాలని సీఎం సూచించారు. ఉద్యోగుల వివరాలు పూర్తిగా డిజిటలైజ్ అయితే చెల్లింపుల్లో జాప్యం, అవకతవకలకు అవకాశం ఉండదన్నారు. డిజిటల్ గవర్నెన్స్ అమలుకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, అవసరమైన సాంకేతిక, పరిపాలనా, చట్టపరమైన అంశాలపై నివేదిక సమర్పించాలని సూచించారు. మొత్తం ప్రక్రియను 100 రోజుల్లో పూర్తి చేసి అమలుకు సిద్ధం చేయాలని గడువు విధించారు. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే వారి వివరాలను డిజిటలైజ్ చేయాలని సీఎం తెలిపారు. ఉద్యోగులందరికీ ఒకే విధమైన సమగ్ర డిజిటల్ డేటాబేస్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డిజిటల్ గవర్నెన్స్ అమలు, జీతాల చెల్లింపులు, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎంఏ&యూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, MCR HRD వైస్ చైర్మన్ శాంతి కుమారి, వేతన సవరణ కమిషనర్ ఎన్. శివశంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా విభాగం కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story