Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం.. ఇక నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు!

Revanth Reddy: తెలంగాణలోని గ్రామపంచాయతీలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది.

Arun Chilukuri
Published on: 27 May 2026 11:33 AM IST
Revanth Reddy
X

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం.. ఇక నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు!

Revanth Reddy: తెలంగాణలోని గ్రామపంచాయతీల బలోపేతం, ఆర్థిక పరిపుష్టి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలకు శుభవార్త చెప్పారు. పల్లెల వికాసమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పంచాయతీలకు పూర్తిస్థాయి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామపంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాల్లో కాకుండా, నేరుగా ఆయా పంచాయతీల సొంత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునేలా 'తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం'లో తగిన మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.

గత విధానం ప్రకారం.. గ్రామపంచాయతీలకు పన్నులు, ఇతర వనరుల ద్వారా వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రెజరీ ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చేది. దీనివల్ల గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టాలన్నా..పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలన్నా..వీధి దీపాల నిర్వహణ చూసుకోవాలన్నా.. నిధుల విడుదల కోసం సర్పంచులు ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వ అనుమతులతో పాటు సాంకేతిక కారణాల వల్ల నిధులు డ్రా చేయడంలో తీవ్ర జాప్యం జరిగి, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడేది. ఈ ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాత వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించారు.

ఈ నూతన విధానం అమల్లోకి వస్తే, గ్రామాల్లో వసూలయ్యే ఆస్తి పన్నులు, నల్లా ఫీజులు, లేఅవుట్ ఫీజులు మరియు ఇతర రూపాల్లో వచ్చే సొంత ఆదాయం నేరుగా పంచాయతీల స్థానిక బ్యాంకు ఖాతాల్లోనే ఉంటాయి. దీనివల్ల నిధుల వినియోగంలో సర్పంచులకు, పంచాయతీ పాలకవర్గానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ట్రెజరీలతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ అవసరాలకు తక్షణమే డబ్బులను డ్రా చేసుకునే వీలుంటుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు చట్ట సవరణకు అవసరమయ్యే ముసాయిదాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఈ నూతన విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అమలు చేయబోతున్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story