Revanth Reddy: నీట్ పేపర్లు పల్లీబఠానీల్లా అమ్ముకున్నారు.. కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాలి
Revanth Reddy: నీట్ ప్రశ్నపత్రాలను కోట్ల రూపాయలకు పల్లీబఠానీల్లా అమ్ముకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy: నీట్ పేపర్లు పల్లీబఠానీల్లా అమ్ముకున్నారు.. కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాలి
Revanth Reddy: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలను వ్యాపార వస్తువుల్లా అమ్ముకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా కొడంగల్‌లోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. "నీట్ ప్రశ్నపత్రాలను పల్లీబఠానీల్లా కోట్ల రూపాయలకు అమ్ముకుని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు. ఈ అంశంపై రాజకీయ పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. లీకేజీకి బాధ్యులైన వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలి" అని డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో ప్రజాసమస్యలను లేవనెత్తడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని రేవంత్ అన్నారు. పార్లమెంట్ ఉభయసభల్లో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై చర్చించాలని కాంగ్రెస్, ఇండియా కూటమి కోరినా ప్రభుత్వం అనుమతించడం లేదని, స్పీకర్ కూడా అంగీకరించకపోవడం ప్రజాస్వామ్యానికి దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఢిల్లీ పోలీసుల చర్యలను విమర్శిస్తూ.. "ఢిల్లీ పోలీసులు దాడి చేయడంతో రాహుల్‌గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. ఈ దేశం కోసం రక్తం చిందించడంలో ఆయన మొదటివారూ కాదు, చివరివారూ కాదు. నాడు మహాత్మాగాంధీ తెల్లదొరలతో కొట్లాడి స్వాతంత్ర్యం తెస్తే.. ఆయనను పొట్టన పెట్టుకున్న గాడ్సే వారసులు ఈరోజు అధికారంలో ఉన్నారు" అంటూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతకుముందు, సీఎం రేవంత్‌రెడ్డి నివాసం నుంచి కొడంగల్‌లోని అంబేడ్కర్ కూడలి వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.




