Revanth Reddy: మహిళా బిల్లు అడ్డుపెట్టుకుని కుట్రలా? డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ సూటి ప్రశ్న!

Revanth Reddy: లోక్‌సభ సీట్ల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

Arun Chilukuri
Published on: 13 April 2026 5:42 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: మహిళా బిల్లు అడ్డుపెట్టుకుని కుట్రలా? డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ సూటి ప్రశ్న!

Revanth Reddy: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేలా బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రధానాంశాలు:

కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల పెంపులో అన్యాయం జరుగుతోందని రేవంత్ మండిపడ్డారు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచితే.. ఉత్తరాదిలో సీట్ల సంఖ్య 620కి చేరుతుందని, దక్షిణాదిలో కేవలం 195 మాత్రమే ఉంటాయని, ఈ భారీ అంతరం ప్రమాదకరమని హెచ్చరించారు.

కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా, దేశ ఆదాయానికి తోడ్పడుతున్న జీడీపీ (GDP) వృద్ధి ఆధారంగా కూడా సీట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తగా పెంచే సీట్లలో సగం జనాభాకు, సగం జీడీపీకి ప్రాతిపదికగా ఉండాలని 'హైబ్రిడ్ మోడల్'ను ప్రతిపాదించారు.

మహిళలకు రాజకీయ హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేస్తూ.. 33% మహిళా రిజర్వేషన్లకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అయితే, వీటిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా వెంటనే (ఆర్నెల్లలో) అమలు చేయాలని డిమాండ్ చేశారు.

"దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆర్థిక రాజధానులు (Financial Capitals). కానీ కేంద్రం కీలక శాఖల కేటాయింపులోనూ, నిధుల విషయంలోనూ దక్షిణాదిపై వివక్ష చూపుతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పన్నులు కట్టడం, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టడం అన్నట్లుగా దక్షిణాది పరిస్థితి మారిందని ఆక్షేపించారు.

సీట్ల పెంపుపై ప్రధాని మోదీ ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని, వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story