Revanth Reddy : అడ్డగోలు ఫ్లెక్సీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ ఫీ‎డ్‌ బ్యాక్

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. అక్రమ ఫ్లెక్సీల నియంత్రణ, ఆహార కల్తీపై కఠిన చట్టాలు, పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ విధానంపై కీలక ఆదేశాలిచ్చారు.

CR Reddy
Published on: 21 May 2026 7:44 AM IST
Revanth Reddy
X

Revanth Reddy

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోలీస్ యంత్రాంగాన్ని గట్టిగా హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా వెలుస్తున్న రాజకీయ, వ్యాపార ఫ్లెక్సీలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర రూపురేఖలను పాడుచేస్తున్న ఈ ఫ్లెక్సీలను నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతున్నారని అధికారులను నిలదీశారు. ఇకపై అక్రమ ఫ్లెక్సీల విషయంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించాలని, జరిమానాలు విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

హైడ్రా, మున్సిపల్, పోలీసుల సమన్వయం..

హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రమాదాల నివారణ కోసం హైడ్రా (HYDRA), మున్సిపల్, పోలీసు విభాగాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నగరంలోని వాణిజ్య సముదాయాలు, గోదాములలో ఫైర్ సేఫ్టీపై పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టి, జూన్ 15 లోగా ఒక సమగ్రమైన నివేదికను తనకు సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గడువు విధించారు.

పోలీస్ బాసులతో ఉన్నత స్థాయి భేటీ

హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పావిలియన్‌లో బుధవారం పోలీస్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఒక హై-లెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. ఇకపై కేవలం మెరిట్, సమర్థత ఆధారంగానే లూప్ లైన్, యాక్టివ్ పోస్టింగులు ఉంటాయని, ఎలాంటి పొలిటికల్ సిఫార్సులకు తావులేదని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడే అధికారులపై కనికరం చూపబోమని వార్నింగ్ ఇచ్చారు.

పోలీస్ శాఖలో కొత్త రూల్స్..

పోలీసుల పనితీరును మెరుగుపరిచేందుకు సీఎం కొన్ని కీలక మార్పులను సూచించారు. ఎస్‌ఐ స్థాయి నుంచి ఎస్పీ వరకు ప్రమోషన్ పొందిన వారు, కనీసం రెండేళ్ల పాటు ఇతర విభాగాలలో (మ్యూచువల్ లేదా లూప్ లైన్ కాకుండా) పనిచేసేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని డీజీపీని ఆదేశించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో అందరికీ అన్ని విభాగాలపై అవగాహన వస్తుందన్నారు. అలాగే, జిల్లా ఎస్పీలు, కమిషనర్లు లాంటి ఉన్నతాధికారులు తమ హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లాల్సి వస్తే.. తప్పనిసరిగా ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలనే నిబంధనను కఠినతరం చేయాలన్నారు.

అవసరమైతే కొత్త చట్టం

సమాజంలో ప్రస్తుతం క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు విపరీతంగా పెరగడానికి మార్కెట్లో జరుగుతున్న ఆహార కల్తీనే ప్రధాన కారణమని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీగాళ్లపై ఉక్కుపాదం మోపాలని ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. ఆహార కల్తీని పూర్తిగా అరికట్టేందుకు అవసరమైతే ప్రస్తుత చట్టాలను సవరించి, మరింత కఠినమైన కొత్త చట్టాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు.

పోలీస్ స్టేషన్లలో QR Code విప్లవం..

పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోలీసు శాఖ కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇకపై రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో క్యూ ఆర్ కోడ్ (QR Code) విధానాన్ని ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు. స్టేషన్‌కు వచ్చే బాధితులు, ప్రజలు అక్కడి సిబ్బంది ప్రవర్తన, పనితీరుపై ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా తమ ఫీడ్‌బ్యాక్ మరియు రేటింగ్ ఇచ్చేలా ఈ సిస్టమ్ ఉండాలన్నారు. తద్వారా పోలీసుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈవీ వాహనాలు, డ్రోన్ పోలీసింగ్..

కాలం చెల్లిన పాత ఆయుధాల స్థానంలో పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని, టెక్నాలజీ ఆధారిత డ్రోన్ పోలీసింగ్‎కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. పర్యావరణ హితాన్ని కాపాడటంలో భాగంగా పోలీస్ పెట్రోలింగ్ వాహనాలలో క్రమంగా ఈవీ (EV) ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలన్నారు. అలాగే నగరాలు, గ్రామాలలో దొంగతనాలు, నేరాల అదుపునకు నైట్ పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. రూ.కోట్లతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీ కెమెరాల నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో నేరాల గుర్తింపునకు వినియోగించుకోవాలన్నారు.

డ్ర*గ్స్ ఫ్రీ తెలంగాణ..

తెలంగాణ రాష్ట్రాన్ని డ్ర*గ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. డ్రగ్స్ సరఫరా చేసే నెట్‌వర్క్‌ల వేళ్లు నరకాలని, అలాగే ఈ వ్యసనానికి బానిసలైన బాధితుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు గానూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్కిల్స్ యూనివర్సిటీలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. రూల్స్ ప్రకారం, వ్యవస్థకు లోబడి పనిచేసే ప్రతి అధికారికి ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని.. కానీ లంచాలకు ఆశపడి పరిధి దాటితే మాత్రం ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story